2014లో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకోవాలని తాము అనుకోలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్వయానా నరేంద్ర మోదీ తన వద్దకు వచ్చి ఏపీపై తమకు సానుభూతి ఉందని.. కలసి పనిచేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పారని ఆయన అన్నారు. అందుకే... ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం.. బీజేపీతో పొత్తు పెట్టుకొనే యోచన చేశామని.. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం వల్లనే.. దేశానికి మొత్తం ఈ విషయాన్ని చెబుతున్నానని చంద్రబాబు అన్నారు.


ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను, సెంటిమెంట్‌ను అర్థం చేసుకోవడంలో బీజేపీ విఫలమైందని.. సమస్యలను పరిష్కరించడంపై ఎలాంటి శ్రద్ధ చూపించడం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విభజన హామీల అమలు  చేస్తామని చెప్పినందుకు, అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో స్పష్టమైన హామీ బీజేపీ ఇచ్చినందునే తాము ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. అప్పట్లో మోదీ కూడా విభజనతో ఆంధ్రప్రదేశ్‌‌కు అన్యాయం జరిగిందని అఖిల సంఘాల సమావేశంలో అన్నారని చంద్రబాబు గుర్తుచేశారు.