శనివారం రాత్రి దుబాయ్ లోని ఒక రిసార్ట్ లో జరిగిన బిజినెస్ లీడర్స్ ఫోరమ్ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ - "దుబాయ్ నిర్మాణములో పాలుపంచుకున్న మీరందరూ .. అమరావతి నిర్మాణంలో కూడా పాలుపంచుకోవాలని కోరుతున్నా. మా రాష్ట్రంలో గొప్ప వనరులు ఉన్నాయి. సుమారు వెయ్యి కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం, అపార ఖనిజ సంపద ఉంది. రాష్ట్రం గుండా వైజాగ్- చెన్నై,  బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్లు పోతున్నాయి. జాతీయ విద్యా సంస్థలతో పాటు, అంతర్జాతీయ విద్యాసంస్థలు రాష్ట్రంలో ఏర్పాటుకాబోతున్నాయి." అన్నారు. 


"మీలో ప్రతి ఒక్కరు ఒక్కో ప్రాజెక్టుతో రాష్ట్రానికి రండి. పెట్టుబడులు పెట్టండి. మీతోపాటు తెలిసిన వ్యాపారవేత్తలు కూడా పెట్టుబడులు పెట్టేలా  ప్రోత్సహించండి. మీకు కావాల్సిన అనుమతులన్నీ తక్షణమే చేస్తాం, రాయితీలు ప్రకటిస్తాం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అధికారులను పంపిస్తాం. అనేక బహుళజాతి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. మూడు పెద్ద సంస్థలు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చాయి. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఎన్ఆర్టీ, ఈడీబీలు సహకరిస్తాయి. యూఏఈ నుండి నేరుగా విజయవాడ, వైజాగ్, తిరుపతికి  విమాన సర్వీసులు ప్రారంభించాలని ఎమిరేట్స్ చైర్మన్ ను కోరా. మీరు ఏపీకి రావడానికి మరింత సులువౌతుంది" అని వివరించారు. ప్రతి ప్రవాసాంధ్రుడు సొంత గ్రామం అబ్రివృద్ధిలో పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు.