రాహుల్ గాంధీతో వచ్చిన సమస్యల్లా అదే : నరేంద్ర మోదీ
హైదరాబాద్ వేదికగా టీడీపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్లపై నరేంద్ర మోదీ విమర్శలు!
హైదరాబాద్ అన్నా.. హైదరాబాద్ వాసులన్నా తనకు చాలా ఇష్టం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్‌కి నవాబుల నుంచి స్వేచ్ఛ లభించడం గురించి చెబుతూ.. సర్ధార్ వల్లభ్ భాయ్ అంటే తనకు ఇష్టమని, సర్ధార్ జీ చొరవ చూపి ఉండకపోయి ఉంటే ఇవాళ తాను ఇలా హైదరాబాద్ వచ్చి మాట్లాడగలిగే స్వేచ్ఛ కలిగి వుండేది కాదని మోదీ అభిప్రాయపడ్డారు. సర్దార్ వల్లభ్ భాయ్ చేసిన కృషి వల్లే తెలంగాణ వాసులకు నవాబుల నుంచి విముక్తి లభించిందని అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సాయంత్రం హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా వంశపారపర్య రాజకీయాలు అంటే తనకు అస్సలు గిట్టవు అని చెబుతూ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ గారు తెలుగు దేశం పార్టీని స్థాపించారు కానీ నేడు అదే పార్టీ స్వార్థప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తూ పార్టీని కుటుంబానికి పరిమితం చేసిందని అన్నారు. ప్రజాస్వామ్యానికి ఈ కుటుంబ రాజకీయాలు మంచిది కాదు అని మోదీ పేర్కొన్నారు.
తెలంగాణ యువతను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ.. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతో ప్రజలకు ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. కేసీఆర్ సర్కార్ కుటుంబపాలనలో తెలంగాణ వెనుకబడిపోయిందని, తెలంగాణ ఏర్పడిన ఫలాలు నిరుపేదలకు అందలేదని ఆరోపించారు. ఇప్పటికే తెలంగాణ ఎంతో నష్టపోయింది. ఇప్పుడైనా తెలంగాణ ప్రజానికం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ భవిష్యత్తును మీరే చక్కదిద్దుకునేందుకు ఇదే సరైన సమయం అని మోదీ పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెడుతూ.. ఆయనతో వచ్చిన సమస్య ఏంటంటే.. నిన్న ఏం చెప్పారో ఆయనకు ఇవాళ గుర్తుండదు అని అన్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఏం చెప్పారో ఆయనకు గుర్తుండదు. ఒకరు రాసిచ్చిన నోట్స్ చూసి చదివే అలవాటు ఆయనది అని రాహుల్‌ని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ గురించి చెబుతూ.. యువకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు మొదలుపెట్టిన కేసీఆర్.. ఆ తర్వాత టీడీపీలో మంత్రి కాలేదా ? ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లినప్పుడు సోనియా గాంధీని గురువుగా భావించలేదా ? ఇవాళ ఆ రెండు పార్టీలతో తనకు సంబంధం లేదని చెప్పుకుని వాటిపై విమర్శలు చేస్తున్న కేసీఆర్‌ని ఎంతమేరకు నమ్మాలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేసీఆర్‌పై తనదైన శైలిలో విమర్శలు సంధించారు.