ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. అనేక రాజకీయ విషయాలతో పాటు రాష్ట్ర పరిస్థితులు, ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదరడానికి ఏం చేయాలి? లాంటి అంశాలపై వారు మాట్లాడినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడంతో విభజన హామీలు నెరవేర్చే విషయంలో మీన మేషాలు లెక్కబెట్టడం లాంటి అంశాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు తన నివాసం నుండి మోదీ, చంద్రబాబుకి ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో చంద్రబాబు మోదీతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని చెప్పాలని ప్రయత్నించగా.. అందుకు వీలుపడలేదు. ఈ క్రమంలో ఈ రోజు మోదీ, సాయంత్రం చంద్రబాబుతో మాట్లాడారు. వారు పరస్పరం వివిధ అంశాలపై చర్చించారని ఇప్పటికే పీఎంఓ ఆఫీసు తెలిపింది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న ఇద్దరు తెదేపా మంత్రుల రాజీనామా అంశాలు.. అందుకు గల బలమైన కారణాలను చంద్రబాబు మోదీకి వివరించినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు మంత్రులకు ఇప్పటికే ప్రధాని 6 గంటల తర్వాత కలిసేందుకు అపాయింట్ మెంట్ కూడా ఇచ్చారు. 


ఇది వరకే చంద్రబాబు తమ ఓఎస్‌డీ, ప్రధాని ఓఎస్‌డీతో మాట్లాడినట్లు తెలిపారు. ముఖ్యంగా అరుణ్ జైట్లీ మాటలు తమ పార్టీని ఎంతగానో బాధించాయని ఆయన అన్నారు. దేశ రక్షణకే ఉన్న డబ్బులు సరిపోవడం లేదని.. మధ్యలో ఆంధ్రులు గొడవేంటి అన్నట్లు ఆయన మాట్లాడారని.. ఆ మాటలు తమను ఎంతగానో బాధించాయని.. ఆ మాటలు చాలా అవమానకరంగా ఉన్నాయని చంద్రబాబు తెలిపారు.


అలాగే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి కేటాయింపులు చేయకపోవడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. అలాగే ప్రత్యేక హోదా విషయంపై ప్రజల్లో నెలకొన్న సంశయాలు తదితర విషయాలపై కూడా కేంద్రం స్పందించాల్సి ఉందని ఆయన తెలిపారు. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా తాజా మీటింగ్‌లో మోదీతో  చంద్రబాబు చర్చించిన్నట్లు తెలుస్తోందని పలువురు రాజకీయ వేత్తలు అంటున్నారు