అమరావతి: సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహానీ ఏపీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వస్తున్నారా అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శిగా సేవలు అందిస్తున్న ఆమెను కేంద్రం రిలీవ్ చేసింది. 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సహానీని ఏపీకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలోనే కేంద్రం ఆమెను ప్రస్తుత విధుల నుంచి రిలీవ్ చేసింది. దీంతో త్వరలోనే ఆమెను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నీలం సహానీ ఏపీ సీఎస్‌గా బాధ్యతలు చేపడితే నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యయదర్శిగా సేవలు అందించిన మహిళా ఐఏఎస్ అధికారిణిగా ఆమె రికార్డ్ సొంతం చేసుకోనున్నారు. నీలం సహానీ 2020  జూన్ నెలాఖరు వరకు ఆమె సర్వీసులో ఉండనున్నారు. 


ఇదిలావుంటే, ఇదివరకు ఎపీ సీఎస్‌గా పని చేసిన 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ నవంబర్4న ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో ఆ తర్వాత ఎల్వీ సుబ్రహ్మణ్యం స్థానంలో నీరబ్ కుమార్‌ ప్రసాద్ తాత్కాలిక సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు.