తిరుమల తిరుపతికి మంచి రోజులొస్తున్నాయా..?
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పాలకమండలి భేటీ ముగిసిన క్రమంలో.. మండలి తీసుకున్న పలు నిర్ణయాలు బాగున్నాయని పలువురు అంటున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పాలకమండలి భేటీ ముగిసిన క్రమంలో.. మండలి తీసుకున్న పలు నిర్ణయాలు బాగున్నాయని పలువురు అంటున్నారు. దేవస్థానం ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ సింఘాల్ ఈ భేటీ తర్వాత టీటీడీ ఉద్యోగులను కలిసి మాట్లాడారు. వారి సూచనలు కూడా తమకు అవసరమేనని.. ఎలాంటి సమస్య ఉన్నా చెబితే పరిష్కరిస్తామని తెలియజేశారు. తాజాగా పాలకమండలి కూడా పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఆ నిర్ణయాల్లో ప్రముఖమైనవి ఇవే.
*అలిపిరి ప్రాంతంలో భక్తుల కోసం 500 గదులతో కాంప్లెక్స్ నిర్మించాలని మండలి భావించింది. అందుకోసం రూ.120 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది.
*ఒకే విభాగంలో మూడు సంవత్సరాల సర్వీసు ఉన్న ఉద్యోగులను.. ఖాళీలను బట్టి వేరే విభాగాలకు కూడా బదిలీ చేస్తామని కూడా మండలి తెలిపింది.
*పరకామణి (హుండీలో నాణెములు మరియు సమర్పణలు లెక్కింపు ప్రక్రియ) డిప్యూటేషన్ విధులను కూడా రద్దు చేసేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది.
*తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే పాఠశాలలు, కళాశాలలలో డిమాండ్ ఉన్న గ్రూపులకు సంబంధించి సీట్ల సంఖ్యను పెంచుతున్నట్లు కూడా పాలకమండలి తెలిపింది.
*అదే విధంగా జీవో నెంబరు 90ను అమలు చేయాలని భావిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తెలిపింది. ఈ జీవో ప్రకారం తితిదే విద్యాసంస్థల్లో బోధించే అధ్యాపకులు పదవీ విరమణ చేశాక.. ఆర్జిత సెలవులు, అర్థ వేతనల సెలవులకు సంబంధించిన నగదు మార్పిడి విధానాన్ని అమలు చేయనున్నట్లు మండలి తెలిపింది.
*తితిదేలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించడానికి తాము ముందుంటామని మండలి తెలిపింది. అందుకోసం ఒక కమిటీని ఇకపై నిర్వహించేందుకు తాము శ్రీకారం చుడుతున్నట్లు మండలి అధికారులు తెలిపారు.
*అలాగే తిరుమలలో వసతి గృహాలను ఆధునీకరించాలని మండలి భావిస్తోంది. అందుకోసం రూ.112 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.