అమరావతి: ఇంటర్ ప్రథమ సంవత్సరం కోర్సులో కొత్త సిలబస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ కమిషనర్ బి.ఉదయలక్ష్మీ మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరం కోర్సులో కొత్త సిలబస్‌ను ప్రవేశపెడుతున్నామని.. మారిన కొత్త సిలబస్ ఈ విద్యా సంవత్సరం (2018-2019) నుంచే అమలులోకి వస్తుందని తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కొత్త భాషా పాఠ్యపుస్తకాలను ఉదయలక్ష్మి సచివాలయంలో సోమవారం విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నైతిక విలువలు, ప్రవర్తన, పర్యావరణంకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలోని విద్యార్థులు నీట్, జేఈఈ, సీఏ వంటి ఎంట్రన్స్ పరీక్షలకు, వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడేవిధంగా సిలబస్‌లో మార్పులు, చేర్పులు చేశామని చెప్పారు. అవసరమైతే కొత్త సిలబస్‌కు సంబంధించి లెక్చరర్లకు శిక్షణ ఇప్పిస్తామన్నారు.


లాంగ్వేజెస్‌లో(తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలు) నూతన సిలబస్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు. మిగతా సబెక్టుల్లో కొన్ని కొత్త అధ్యాయాలను చేర్చామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలోనూ నూతన సిలబస్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.