విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది తాము ఇవ్వలేనప్పటికీ.. అందుకు సమానమైన సహాయ సహకారాలు ఇస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు. ఢిల్లీలో జరిగిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ మధ్యకాలంలో కేంద్రంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని గెలిచిన ప్రధాని మోదీకి తాను అభినందనలు చెబుతున్నానని ఈ సందర్భంగా గడ్కరి తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే ఆంధ్రప్రదేశ్ గురించి కూడా తన అభిప్రాయాలను చెబుతూ.. కేంద్రం ఏపీకి అందించాల్సిన సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తోందని.. అయితే పలువురు హోదా పేరు చెప్పి ప్రజలను రెచ్చగొడుతూ తప్పుదారి పట్టించే దిశగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తమ పై లోక్‌సభలో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పటి.. తాము అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని కూడా ఉపయోగించుకున్నామని గడ్కరి అన్నారు. 


ఒక రకంగా చెప్పాలంటే అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు.. బీజేపీకి ప్రజలకు వాస్తవాలు చెప్పే అవకాశం దక్కిందని.. తాము చేపడుతున్న కార్యక్రమాల గురించి ప్రజలతో మాట్లాడే అవకాశం లభించిందని నితిన్ గడ్కరి అన్నారు. పార్లమెంటు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం లేకపోయినా.. స్వార్థపూరితమైన భావనతోనే ప్రతిపక్షాలు ఏకమయ్యాయని గడ్కరి అభిప్రాయపడ్డారు.