అమరావతి: బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. ఏపీలో నూతనంగా ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ కారణంగా తీవ్రమైన ఇసుక కొరత ఏర్పడిందని, ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేసిన పవన్ కల్యాణ్.. వారికి సంఘీభావంగా నవంబర్ 3వ తేదీన లాంగ్ మార్చ్‌ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కన్నా లక్ష్మీనారాయణకు ఫోన్ చేసిన పవన్ కల్యాణ్.. విశాఖలో చేపట్టనున్న లాంగ్ మార్చ్‌‌లో పాల్గొనాల్సిందిగా ఆయనను కోరారు. పవన్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కన్నా.. అందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని జనసేన పార్టీ తెలిపింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలిచే క్రమంలో ఏపీ సర్కార్‌పై చేస్తోన్న ఈ పోరాటానికి అన్ని పార్టీలు కలిసి రావాల్సిందిగా పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఇప్పటికే బీజేపీ, వామపక్షాలు స్పందించాయని.. మిగిలిన పార్టీలు సైతం ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తిచేశారు.