నా రాజకీయ యాత్ర ప్రారంభం..ఆశీర్వదించండి: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ యాత్రకు ముహుర్తం ఖరారైంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ యాత్రకు ముహుర్తం ఖరారైంది. తన పొలిటికల్ జర్నీని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుండి మాత్రమే ప్రారంభిస్తానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ట్విట్టర్‌లో ప్రకటించారు. 2009 ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తున్న సమయంలో పెను ప్రమాదం నుండి ఆ ఆలయ మహిమ వల్లే బయటపడినట్లు.. అలాగే తన ఇలవేల్పు కూడా ఆంజనేయస్వామి కావడంతో తన రాజకీయ అప్రతిహత యాత్రను కొండగట్టు నుండి ప్రారంభించాలని భావించినట్లు పవన్ తెలిపారు. సర్వమత ప్రార్ధనల తర్వాత తాను ఇరు రాష్ట్రాల జనాల ఆశీర్వచనాల కోసం వస్తానని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన పెంపొందించుకొనేందుకు తాను ఈ యాత్ర కొనసాగిస్తానని.. ఈ క్రమంలో సామాన్యులను కలుస్తానని.. తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. తన యాత్ర వివరాలను, భావి కార్యాచరణను కొండగట్టులోనే ప్రకటిస్తానని ఆయన ట్విటర్‌లో తెలిపారు. ఈ వ్యాఖ్యలతో పాటు పవన్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఫొటోను కూడా ట్వీట్ చేశారు.