విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకే ఆయన వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. పవన్ మాత్రం అక్కడ కేంద్రంలోని పెద్దలను కలిసి ఏపీలోని పరిస్థితులను వివరించి, ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకే వెళ్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఏపీలో ఇసుక కొరత సమస్య, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం మాధ్యమంలో భోదన వంటి అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన పవన్ కల్యాణ్... అవసరమైతే ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెళ్లి కేంద్రంలోని పెద్దలు ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలుస్తానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 


పవన్ గతంలో చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలోనే  కేంద్రంలోని పలువురు పెద్దలతో ఆయన భేటీ అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. పవన్ వెంట పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉండటం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లయింది.