కాకినాడ సీపోర్టులో జరుగుతున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావని.. విశాఖలో చిన్నపాటి థియేటర్ యజమానైన మెలోడి వెంకటేశ్వరరావు (కెవి రావు) ఆ సీపోర్టుకి యాజమాని అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను సినిమాలు చేస్తున్నప్పుడు ఆయనను రెండు సార్లు కలిశానని పవన్ అన్నారు. ఒక సాధారణ థియేటర్ యజమాని కోట్లాది రూపాయల విలువ గల సీపోర్టుకి యజమానిగా మారడం తనకు ఆశ్చర్యం కలిగించిందని.. ఈ అక్రమ వ్యవహారాలకు కారణమైన ఆయన ప్రస్తుతం విదేశాలలో ఉన్నారని.. ఆయనను వెంటనే భారతదేశానికి రప్పించి కేసులు నమోదు చేయాలని పవన్ డిమాండ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనసేన అధికారంలోకి వస్తే ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్న కాకినాడ సీపోర్టు లైసెన్స్ రద్దు చేస్తామని.. ప్రస్తుతం ఈ అంశంపై చంద్రబాబు లేదా జగన్ మాట్లాడరని.. ఎందుకుంటే బహుశా వారు కూడా ఈ పోర్టు యజమానితో కుమ్మక్కయ్యారనే అనుమానం తనకు కలుగుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. నేడు ప్రభుత్వంలో ఉన్న నేతలు కూడా పర్యావరణానికి అండగా ఉన్నామని చెబుతూ.. పర్యవారణ విధ్వంసానికి పాల్పడే వారిని ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. 


నేడు పార్టీ జెండాలు పాతి వ్యాపారాలు చేసుకుంటున్నాయి తప్ప పర్యావరణాన్ని కాపాడే విషయంలో ఆలోచన చేయడం లేదని పవన్ అన్నారు. ఇక్కడ అక్రమాలు చేసి పారిపోయిన కెవి రావు అనే వ్యక్తిని భారతదేశం రప్పించి అక్రమార్కుల  గుట్టు రట్టు చేసేందుకు తాను అమెరికాలోని సెనేటర్స్‌ని కూడా సంప్రదిస్తానని.. అలాగే అక్కడి ఎఫ్‌బీఐకి కూడా సమాచారం అందిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎప్పుడూ విదేశాలకు వెళ్లే చంద్రబాబు.. ఇక్కడ దోపిడీ చేస్తూ విదేశాలకు పారిపోయే అక్రమార్కులను కూడా ఇక్కడకు రప్పించి శిక్షిస్తే బాగుంటుందని పవన్ అన్నారు.