2019 ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలవదు: పవన్ కళ్యాణ్
రాబోయే ఎన్నికల్లో టీడీపీకి గెలిచే అవకాశాలు తక్కువని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీకి గెలిచే అవకాశాలు తక్కువని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. చంద్రబాబు సర్కారు అవినీతిపరులకు పెద్దపీట వేయడం వల్లే.. ఆ పార్టీకి ఆ పరిస్థితి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ, రాజాం మండల కేంద్రాల్లో నిర్వహించిన జనపోరాట యాత్రలో పవన్ ప్రసంగించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి టీడీపీ బాధ్యత వహించాలని ఆయన తెలిపారు.
చంద్రబాబు ప్రభుత్వం నిధులన్నీ అమరావతికే మళ్లిస్తే.. మిగతా జిల్లాలను ఎలా అభివృద్ధి చేస్తారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఏం తప్పు జరిగిందో... ఇప్పుడు అమరావతి పేరు చెప్పి చంద్రబాబు ప్రభుత్వం అదే తప్పు చేయడానికి సిద్ధపడుతుందని.. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎవరిని అడిగి టీడీపీ ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుందని పవన్ మండిపడ్డారు.
అలాగే శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు కేంద్రాన్ని పెట్టవద్దని పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన ఆలోచనలు ఎప్పుడూ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత సమాజం చుట్టే తిరుగుతాయని ఆయన అన్నారు. కచ్చితంగా ప్రత్యేక హోదా రావాలనే జనసేన కోరుకుంటుందని.. ఎన్ని సమస్యలు ఎదురైనా ఈ ఉద్యమం ఆగదని పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే ఉద్దానం బాధితుల కోసం మండలానికొక డయాలసిస్ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పవన్ డిమాండ్ చేశారు.