ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్న  జనసేన చీఫ్ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోనే అత్యధిక నియోజకవర్గాలున్న ఈ జిల్లాలో పట్టు సాధిస్తే రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించవచ్చనేది పవన్ కల్యాణ్ వ్యూహం. కాపు సామాజికవర్గంతో పాటు బీసీ, దళిత ఓటర్లను అధికంగా ఉండే ఈ జిల్లాలో వారిని ఆకర్షించేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. కాగా తూగో పర్యటనలో స్థానిక సమస్యలే అస్త్రంగా ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సిద్ధమౌతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనసేనలోకి పలువురు సీనియర్లు


ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ జనసేన సమన్వయ కమిటీలను నియమించడంతో పాటు పార్టీ శ్రేణులకు ఎన్నికల కోసం  సన్నద్ధం చేశారు. తాజాగా పవన్ రేపటి నుంచి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే భాగాంగా పార్టీ పటిష్టత కోసం ఆయా నియోజకవర్గాల్లో  సమన్వయ కమిటీలు నియమించనున్నారు. పవన్  పర్యటన సందర్భంలో జనసేన పార్టీ కండువాకప్పుకునేందుకు మాజీ ఎంపీ హర్షకుమార్ తో పాటు పలువురు సీనియర్లు రంగం సిద్ధం చేసుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా పవన్ తూ.గో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్  జనసేన కార్యాలయం ఈ రోజు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.


తూ.గో పర్యటన షెడ్యూల్ ఇదే...


పార్టీ ఇచ్చిన సమాచారం ప్రకారం నవంబర్ 2 నుంచి 9వ తేదీ వరకూ 8 రోజుల పాటు పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసిన ప్రజలతో పవన్ ముఖాముఖి సమావేశం అవుతారు. ఇందులో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కాకినాడలోని నియోజకవర్గాల్లో పవన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.  తొలి రోజు తుని నియోజకవర్గంలోని గొల్ల అప్పారావు సెంటర్ లో నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకుంటారు.