జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంయుక్తంగా నేడు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్రలు చేపట్టారు. ఈ మూడు పార్టీల నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్ని జాతీయ రహదారుల మీదుగా ఈ పాదయాత్రలు జరిగాయి. జాతీయ రహదారులు లేని ప్రాంతాల్లో ప్రధాన కూడళ్ల వద్ద ఈ పాదయాత్ర చేపట్టారు. విజయవాడలో జరిగిన పాదయాత్రలో పవన్ కల్యాణ్, మధు, రామకృష్ణలు స్వయంగా పాల్గొన్నారు. అంతకన్నా ముందుగా జనసేనాని పవన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రులకు బీజేపీ చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ శాంతియుత పద్ధతిలో తాము చేస్తోన్న ఈ నిరసన కార్యక్రమం ఢిల్లీలో వున్న పెద్దలకు తాకేలా వుంటుంది అని అన్నారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

పాదయాత్రలో భాగంగా తొలుత తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద వున్న బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పవన్ కల్యాణ్ అనంతరం బెంజి సర్కిల్ చేరుకుని అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో జనసేన పార్టీ, సీపీఐ (ఎం). సీపీఐ పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.