ఉత్తరాంధ్రలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యామనానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయి - పవన్
విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు
ఉత్తరాంధ్ర యాస, బాష, సంస్కృతి, ఆత్మను అర్థం చేసుకున్న ఏకైక పార్టీ జనసేన అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విశాఖలో ఉత్తరాంధ్ర మేధావులతో గురువారం పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర వెనకబాటుతనంపై మేధావులతో చర్చించారు. భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ నటుడిగా తన ప్రయాణాన్ని ఉత్తరాంధ్ర నుంచి ఎలాగైతే ప్రారంభించానో రాజకీయ ప్రయాణాన్ని కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించానని పవన్ వెల్లడించారు. వాస్తవానికి ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం కాదని.. వెనక్కి నెట్టేసిన ప్రాంతమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దారితీసేలా ఉత్తరాంధ్ర పరిస్థితులు ఉన్నాయని జనసేన అథినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
2003లోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నా - పవన్
వాస్తవానికి తన 2003లోనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని పవన్ తన మనసులో మాటను బయటపెట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి ముఖ్య కారణం సమస్యలను అర్ధం చేసుకోవడం కోసమేనని వివరణ ఇచ్చారు. రాజకీయ సుస్థిరత కోసం 2014లో టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు ఇచ్చానని పేర్కొన్నారు. తనకు రాజకీయాల్లో లబ్ధి పొందాలనే ఆలోచన ఉన్నట్లయితే ఆనాడు బీజేపీకి కేంద్ర మంత్రి పదవి అడిగేవాడినని... టీడీపీకి మద్దతిచ్చినందుకు చేసే వాడినని పవన్ వివరించారు. టీడీపీ, వైసీపీలకు డబ్బులిస్తే జనం వస్తారు.. జనసేనకు మాత్రం స్వచ్ఛందంగా ప్రేమతో వస్తారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.