ఎన్నికల్లో టీడీపీ సత్తెనపల్లి అభ్యర్ధిగా పోటీ చేసిన కోడెల శివప్రసాద్ పై కేసు నమోదైంది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం గుంటూరు జిల్లా రూరుల్ ఎస్పీ రాజశేఖర్ ఆదేశాల మేరకు రాజుపాలెం పీఎస్ లో ఈ మేరకు కేసు నమోదు చేశారు. కోడెలతో పాటు 22 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన జిల్లా రూరల్ ఎస్పీ రాజశేఖర్  కేసు నమోదు చేయాలని స్థానిక రాజుపాలెం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎందుకుంటే...?
ఎన్నికల పోలింగ్‌ సమయంలో వైసీపీ వారు దొంగ ఓట్లు వేయిస్తున్నారనే సమాచారంతో కోడెల శివప్రసాదరావు ఇనిమెట్ల పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చి కోడెలను చుట్టుముట్టారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమయంలో కోడెల గాయాలతో  అతికష్టంపై భద్రతా సిబ్బంది బయటకు తీసుకొచ్చారు.


ఈ ఘటనలో వైసీపీ వారిపై టీడీపీ నేత కోడెల పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీకి చెందిన 20 మందికి పైగా కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు  వైసీపీ వారు కూడా కోడెలతో పాటు టీడీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు. కోడెలపై ఇనిమెట్ల పోలింగ్‌ కేంద్రంలోని వైసీపీ ఏజెంట్‌ గా వ్యహరించిన వ్యక్తి చేసినా ఫిర్యాదును పోలీసులు స్వీకరించకపోవడంతో  వైసీపీ వారు ఆందోళన బాట పట్టారు. 


ఈ విషయాన్ని జిల్లా రూరల్ ఎస్పీ రాజశేఖర్ కు ఫిర్యాదు చేశారు. ఇనిమెట్ల పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లను బెదిరించే విధంగా కోడెల ప్రవర్తించారని..దీనిపై స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపిస్తూ... ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని వైసీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ  కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.తాజా ఆదేశాల మేరకు కోడెలపై పోలీసులు కేసు నమోదు చేశారు.