త్వరలో రాష్ట్రంలో పోలీసు పోస్టుల భర్తీ చేపట్టనున్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ చెప్పారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో పాల్గొనటానికి బుధవారం గుంటూరుకు వచ్చిన ఆయన.. పోలీసు పరేడ్ మైదానంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే రాష్ట్రంలో పోలీసు నియామకాలు చేపట్టనున్నామన్నారు. కానిస్టేబుల్‌ ఆ పోస్టులోనే రిటైర్‌ కాకుండా కనీసం హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టుకు చేరుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విశాఖ జిల్లాలో ఇటీవల ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు కాల్చి చంపడాన్ని ప్రస్తావిస్తూ.. మావోయిస్టు సమస్యతోపాటు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. పోలీసు అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


గత నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ విభాగాల్లో మొత్తం 20,010 భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దీనిలో స్వల్ప మార్పులు చేసి 18,450 ఖాళీలనే భర్తీచేయనున్నట్లు ఆర్థికశాఖ తెలిపింది. ఈ పోస్టుల భర్తీలో డిపార్ట్ మెంట్‌ల వారీగా హోమ్ శాఖకు మూడు వేల పోస్టులు కేటాయించారు. ఆర్థిక శాఖ నుంచి కూడా లైన్ క్లియర్ కావడంతో ఏపీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లను సిద్ధం చేసే పనిలో ఉన్నాయని సమాచారం. త్వరలోనే వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.


టీచర్లు, పోలీసు ఉద్యోగాలు మినహా మిగిలిన అన్ని పోస్టులను ఏపీపీఎస్సీ(appsc)యే భర్తీ చేస్తుంది. పోలీసు నియామకాలను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(apslprb) భర్తీ చేస్తుంది. నియామకాల్లో కానిస్టేబుల్, ఎస్సై, ఆర్ఎస్సై, ఫైర్ మెన్ పోస్టులు ఉంటాయని తెలిసింది. కాగా రాష్ట్రంలోని ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.



మొత్తం పోస్టులు: 18,450 పోస్టులు


  • గ్రూపు 1- 182 పోస్టులు

  • గ్రూపు 2- 337పోస్టులు

  • గ్రూపు-3- 1670 పోస్టులు

  • హోంశాఖ- 3000 పోస్టులు

  • వైద్యారోగ్య శాఖ-1604 పోస్టులు

  • లెక్చరర్స్ -725 పోస్టులు

  • ఉపాధ్యాయులు -9275 పోస్టులు

  • ఇతర శాఖలో ఖాళీలు-1657 పోస్టులు