అవిశ్వాసంపై అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్న రాజకీయ పార్టీలు
టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు ఉదమం 11 గంటలకు చర్చ ప్రారంభం కానుంది. అవిశ్వాసంపై వాదించేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. అధికార పక్షాన్ని ఇరకాటంలో పడేలా చేయాలని ప్రతిపక్ష పార్టీలు పక్కా ప్లాన్ చేసుకోగా.. ఎదురు దాడి చేసేందుకు బీజేపీ తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ అంశంపై ముందుగా టీడీపీ ఎంపీ గల్లా జయ్ దేవ్ చర్చ ప్రారంభిస్తారు. అనంతరం రాహుల్ తో సహా మిగిలిన ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తారు. చివరిగా ప్రతిపక్షాలు లేవనినెత్తిన అంశాలపై ప్రధాని మోడీ వివరణ ఇస్తారు.
సా. 6 గంటలకు ఓటింగ్
అవిశ్వాసంపై చర్చించేందుకు ఏడుగంటల సమయాన్ని స్పీకర్ కేటాయించారు. పార్టీ బలాబలాలను బట్టి పార్టీలకు సమయం కేటాయించారు. అధికార పార్టీ బీజేపీకి 3.33 గంటల సమయం కేటాయించగా..ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నకాంగ్రెస్ కు 38 నిమిషాలు కేటాయించారు. ఇక అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిన టీడీపీకి 13 నిమిషాలు మాత్రమే కేటాయించారు. ఇకమిగిలిన పార్టీల విషయానికి వస్తే ఏఐడీఎంకే 29 టీఎంసీసీ 27 , బీజేడీ 15, శివసేన 14, టీఆర్ఎస్ కు 9 నిమిషాలు నిమిషాల పాటు సమయం కేటాయించారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ సభ్యులు రాజీనామా చేయడంతో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోయింది. కాగా ఈ రోజు సాయంత్ర 6 గంటలకు అవిశ్వాసంపై స్పీకర్ ఓటింగ్ నిర్వహించనున్నారు
మెజార్టీ కోసం బీజేపీ..ఐక్యత కోసం ప్రతిపక్షాలు
విభజన హామీలు నెరవేర్చనందుకు మోడీ సర్కార్ పై టీడీపీ అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టగా ప్రతిపక్ష పార్టీలు దీనికి మద్దతు తెలిపాయి. 50 మంది సభ్యుల కంటే ఎక్కువ మంది అవిశ్వాస ప్రతిపాదనకు ఓకే చెప్పడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ దీన్ని ఆమోదించి చర్చకు అనుమతి ఇచ్చారు. లోక్ సభ ఆర్డర్ ప్రకారం ఈ రోజు దీనిపై చర్చించాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ అవిశ్వాస తీర్మానం తీరు చూస్తుంటే అధికార పక్షం మోజార్టీ నిరూపించేందుకు సిద్ధపడుతుండగా .. ప్రతిపక్ష పార్టీలు ఐక్యత కోసం అవిశ్వాస తీర్మానాన్ని ఉపయోగించుకంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.