దేశ ప్రధానిగా మోదీ ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ కి ఏమీ రావని అనంతపురం తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సోమవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జేసీ భేటీ అయ్యారు. పావు గంటకు పైగా సీఎంతో సమావేశమైన జేసీ.. వివిధ అంశాలను అయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబుతో భేటీ అనంతరం జేసీ మీడియాతో మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశాను. ఇప్పుడు అంతా ఆల్‌ రైట్’’ అని జేసీ అన్నారు. అలగడానికి, పార్లమెంట్ కు వెళ్లకపోవడానికి సంబంధం లేదని అన్నారు. దేశంలో ఎవరి మీద అలిగినా ప్రయోజనం ఉండదన్నారు. తాను ఎవరి మీదో అలిగి పార్లమెంటుకు వెళ్లలేదనేది వాస్తవం కాదని దివాకర్‌రెడ్డి చెప్పారు. సీఎంను కలిసి అంతా చెప్పానని.. అయితే ఆయనతో ఏమి మాట్లాడాననే విషయాలు బయటకి చెప్పనని అన్నారు. తాను పార్లమెంట్‌కు హాజరవుతున్నానని తెలిపారు.


మోదీ ప్రధానిగా ఉన్నంత ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చరని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాజకీయాలు ఎక్కడా బాగాలేదని...రాజకీయాల్లో అతివృష్టి, అనావృష్టి ఉండకూడదని అన్నారు. ప్రత్యేక హోదాపై సీడబ్ల్యూసీ తీర్మానం ఒట్టిమాటేనని జేసీ దివాకర్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.