కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ప్రధాని మోడీ తెలుగులో పలకరించారు. రోగి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించిన మోడీ .. అతనితో  'ఎలా ఉన్నారు? బాగున్నారా?' అంటూ అప్యాయంగా పలకరించారు..మోడీ తెలుగులో మాట్లాడటమేంటి అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది కదూ..వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి ప్రయోజన (పీఎంబీజేపీ) పథకం లబ్ధిదారులతో ఢిల్లీ నుంచి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో స్వయంగా మోదీ  మాట్లాడారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విజయ్ బాబు అనే కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్థుడితో మాట్లాడారు. ఈ సందర్భంగా  మోదీ తెలుగులో కొద్ది సేపు మాట్లాడి ఆశ్చర్యపరిచారు. ‘విజయ్ బాబుజీ  ! ఎలా ఉన్నారు? బాగున్నారా?’ అని మోదీ ప్రశ్నించారు.


ప్రధాని అప్యాయ పలకరింపుతో  విజయ్ బాబు ఆనంద బాష్పాలు రాల్చాడు. ఈ సందర్భంలో ప్రధాని అడిగిన ప్రశ్నకు బాధితుడు ఇలా సమాధానం ఇచ్చాడు... ‘ గత మూడేళ్లుగా నాకు డయాలసిస్ జరుగుతోంది. దీనికి తోడు ముప్పై ఏళ్లుగా నాకు బీపీ కూడా ఉంది. ఒక ఏడాది పాటు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటే ఎక్కవ మొత్తంలో ఖర్చయింది. మందులు తీసుకునే స్థోమత లేదు. దీంతో మందులు వేసుకోవడం మానేశా. ఇంతలో మీరు ప్రవేశపెట్టిన జనౌషధి ప్రయోజన పథకం ద్వారా జనౌషధిలో మందులు కొనుగోలు చేస్తున్నాను. ఇప్పడు నా ఆరోగ్యం బాగానే ఉంది. ప్రభుత్వం ఇలాంటి స్కీం ను ప్రవేశపెట్టకపోయినట్లయితే  నా లాంటి నిరుపేదోళ్లు చాలామంది చనిపోయేవాళ్లు. మీరు ప్రవేశపెట్టిన స్కీం బడుగు వర్గాల వారికి ఆరోగ్య రక్షణ కల్పిస్తుందని చెప్పాడు ఆ బాధితుడు.


కిడ్నీ బాధితుడి మాటల్ని ఓపికతో విన్న ప్రధాని మోదీ ‘ఈ పథకం ద్వారా మిగులుతున్న డబ్బును మంచిగా వాడుకోండి. మీ పిల్లలు, అమ్మాయిల చదువులకు వాడుకోండి అంటూ సలహా ఇచ్చారు దేశ ప్రధాని మోడీ.