YSRCP MLA vs YSRCP MLC: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే vs వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీనా ? అదేంటి ఆ ఇద్దరూ ఒకే పార్టీ కదా.. మరి ఇక ఇద్దరి మధ్య గొడవేం ఉంటుందనే కదా మీ డౌట్.. ఆ.. ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది. ఇద్దరూ అధికార పార్టీ నేతలే కావడం వల్లే నియోజకవర్గంలో పై చేయి కోసం ''తూ కిత్తా అంటే.. తూ కిత్తా'' అన్నట్టు చెలరేగిపోతున్నారు. వైసీపి అధికారంలోకి వచ్చిన తర్వాత వివాదాస్పద ఘటనలు, వ్యాఖ్యలతో ఆ నియోజకవర్గంలో అధికార పార్టీలో నేతల మధ్య వ‌ర్గ విభేదాలు ర‌చ్చ‌కెక్కాయి. నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలే రెండు వ‌ర్గాలుగా విడిపోయి ఒక‌రిపై మరొక‌రు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నారు. బెదిరింపుల‌కు దిగుతున్నారంటూ అధికార పార్టీకి చెందిన నేతలే పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తుండ‌టం ఆ నియోజకవర్గంలో నెలకొన్న అశాంతికి అద్దం పడుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీలో జ‌రుగుతున్న వ‌ర్గ‌పోరుపై రాష్ర్ట వ్యాప్తంగా దుమారం రేగుతోంది. నాయకుల మధ్య ఎప్పుడు, ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితిలో కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు పాలిటిక్స్‌పై పూర్తి విశ్లేషణాత్మక కథనం మీ కోసం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కడప జిల్లాలో ప్రొద్దుటూరు కీలక నియోజకవర్గం... ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి ప్రొద్దుటూరు నుండి 2014,2019 లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. రాచమల్లు తర్వాత ప్రొద్దుటూరులో అంతటి స్థాయి నాయకుడు లేకపోవడం, ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో మొదట్లో ప్రొద్దుటూరులో రాచమల్లు చెప్పిందే శాసనంగా మారింది. కానీ రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అన్నచందంగా ప్రొద్దుటూరుకు చెందిన ర‌మేష్ యాద‌వ్ అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి చేజిక్కించుకోవడంతో అప్పటి నుండే వైసిపిలో ఆదిపత్య పోరు మొదలైంది. 


అంతకంటే ముందు అసలేం జరిగిందంటే..
2019లో వైసీపీ అధికారం చేప‌ట్టాకా ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డితో ర‌మేష్‌ యాద‌వ్ స‌న్నిహితంగా ఉండేవారు. ఆ సమయంలో ర‌మేష్‌యాద‌వ్‌కు పార్టీలో ఎలాంటి ప‌ద‌వీ లేదు. ఆయ‌న తండ్రి వెంక‌ట సుబ్బ‌య్య మున్సిప‌ల్ మాజీ ఛైర్మ‌న్ కావ‌డంతో ర‌మేష్‌యాద‌వ్ కూడా ఆ పీఠం ఎక్కాల‌నుకున్నారు. దీంతో ఎమ్మెల్యే వెంటే ఉంటూ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున ఛైర్మ‌న్ స్థానం ఆశించారు. అందుకు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసిన‌ట్లు అప్ప‌ట్లో చ‌ర్చ జ‌రిగింది. 11వ వార్డు నుంచి పోటీ చేసి ర‌మేష్ యాద‌వ్‌ కౌన్సిల‌ర్‌గా గెలుపొందారు. ఇక ఛైర్మ‌న్ సీటు ద‌క్కుతుంద‌నేలోపే సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఛైర్మ‌న్ స్థానాన్ని ప‌ద్మ‌శాలీ సామాజికవర్గానికి చెందిన మ‌హిళ‌ల‌కు కేటాయిచండంతో ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అప్ప‌టి నుంచి ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి, ర‌మేష్ యాదవ్‌లు ఎడ‌మొహం పెడ‌మోహంగా ఉండడం మొదలైంది.


ఇద్దరి మధ్య చిచ్చురేపిన ఫ్లెక్సీ గొడవ..
ప్రొద్దుటూరు మున్సిప‌ల్ ఛైర్మ‌న్ స్థానం ద‌క్క‌క‌పోవ‌డంతో నిరాశ‌కు గురైన ర‌మేష్ యాద‌వ్‌.. ప‌ట్టుప‌ట్టి మరీ ఎమ్మెల్సీ ప‌దవి ద‌క్కించుకున్నారు. అధికార పార్టీలో బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ర‌మేష్‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న‌కు బెదిరింపు కాల్స్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై బెదిరింపులకు పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అప్ప‌ట్లో ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి కూడా జిల్లా ఎస్పీ అన్బురాజ‌న్‌కు కాల్ చేసి మాట్లాడారు. అయినా ఇప్ప‌టికీ వారిని గుర్తించలేదు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మ‌ద్య త‌రచూ విభేదాలు చోటు చేసుకుంటుండటంతో అంతర్గతంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఓ రోజు ఎమ్మెల్సీ ర‌మేష్‌ యాదవ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప‌ట్ట‌ణంలో ఆయ‌న వ‌ర్గీయులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ప్లెక్సీల్లో రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి ఫోటో లేక‌పోవ‌డంతో గొడ‌వ‌కు దారి తీసింది. ఎమ్మెల్యే వ‌ర్గీయులు ఎమ్మెల్సీ వ‌ర్గీయుల‌పై దాడి చేశారు. అప్ప‌ట్లో ఈ  ఘ‌ట‌న రాష్ర్ట వ్యాప్తంగా దుమారం రేపింది. దీనికితోడు వైసీపీ కార్య‌క్ర‌మాల‌కు ఎమ్మెల్సీకి, ఆయ‌న వ‌ర్గీయులకు పిలుపు లేదు. దీంతో ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్‌, ఎమ్మెల్యేతో దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లుకు ఎవరు ఎదురు తిరిగినా అంతమొందిస్తారనే ఆరోపణలూ  ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త నందం సుబ్బయ్య హత్య రాష్ట్రంలోనే పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే నారా లోకేష్ నందం సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హత్య చేయించారని ఆరోపించారు. టిప్పు సుల్తాన్ విగ్రహం వివాదం కూడా వైకాపా, బీజేపి మద్య తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసింది. వివాదాస్పద రాజకీయాలకు ప్రొద్దుటూరు కేంద్రంగా మారిందనే విమర్శలు లేకపోలేదు. ఒకానొక దశలో వైకాపా అధిష్టానానికి ప్రొద్దుటూరు తలనొప్పిగా మారిందని టాక్ కూడా వైకాపా లో చర్చనీయాంశమైంది.


మరింత దూరం పెంచిన జండా చెట్టు కూల్చివేత ఘటన..
ఇది ఇలా ఉండ‌గా ఇప్పటివరకు ఎమ్మెల్యేతో స‌న్నిహితంగా ఉన్న‌నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా మారుతున్నారు. ప్ర‌ధానంగా ప్రొద్దుటూరులో మేజ‌ర్ పంచాయితీ అయిన కొత్త‌ప‌ల్లి స‌ర్పంచ్ శివ‌చంద్రా రెడ్డి.. మొద‌టి నుంచి ఎమ్మెల్యేతో క‌లిసి న‌డిచేవారు. ఏమైందో ఏమో తెలియ‌దు కానీ ఆయ‌న కూడా ఒక్క‌సారిగా ఎమ్మెల్యేతో విబేదించి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో క‌లిసిపోయారు. ఇదిలా ఉండ‌గా  మున్సిప‌ల్ కౌన్సిల‌ర్లు సైతం ఒక్కొక్క‌రూ ఎమ్మెల్సీ వ‌ర్గం వైపు అడుగులు వేస్తున్నారు. మున్సిపాలిటీలో కౌన్సిల‌ర్ల‌కు ప్రాదాన్య‌త ఇవ్వ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఇక్క‌డ బ‌లంగా వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల్లో భాగంగా గ‌విని కూడ‌లిలో ఉన్న జెండాచెట్టును అధికారులు కూల్చివేస్తుండ‌టంతో అధికార పార్టీకి చెందిన 22వ వార్డు కౌన్సిల‌ర్ మ‌హ్మ‌ద్‌ గౌస్ వ్య‌తిరేకించారు. ముంద‌స్తు స‌మాచారం లేకుండా ఎలా కూల‌దోస్తార‌ని ప్ర‌శ్నించిన మ‌హ్మ‌ద్‌తో పాటు, అత‌నికి మ‌ద్ద‌తు ఇచ్చిన మ‌రో వైసీపి కౌన్సిల‌ర్ గౌస్‌ను పోలీసులు అరెస్టు చేసి స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. దీంతో మిగిలిన వైసీపీ మైనారిటీ కౌన్సిల‌ర్లు వారికి మ‌ద్ద‌తు ఇస్తూ స్టేష‌న్‌కు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశారు. ద‌ర్నా చేస్తున్న స‌మ‌యంలో ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి సాయంత్రం వ‌ర‌కూ వారి వ‌ద్ద‌కు వెళ్ల‌లేదు. సాయంత్రం స్టేష‌న్‌కు వెళ్లిన ఎమ్మెల్యే వారితో మాట్లాడి స‌మ‌స్యను ప‌రిష్క‌రించారు. 


ఎమ్మెల్యేకు ఎదురు తిరిగిన సొంత మనుషులు..
జెండాచెట్టు వివాదం జ‌రిగిన‌ప్ప‌టి నుంచి మున్సిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ ఖాజా, కౌన్సిల‌ర్లు మ‌హ్మ‌ద్‌ గౌస్‌, మునీర్‌లు కూడా ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లుకు దూరంగా ఉంటూ ఎమ్మెల్సీకి ద‌గ్గ‌రయ్యారు. జిల్లాలో జ‌రిగిన ప్లీన‌రీ స‌మావేశానికి కూడా వైస్ ఛైర్మ‌న్ ఖాజా, స‌ర్పంచ్ శివచంద్రా రెడ్డి, మ‌రో ముగ్గురు కౌన్సిల‌ర్లు ఎమ్మెల్సీతో పాటు కలిసి వెళ్ల‌డం ప్రొద్దుటూరులో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వారితో పాటు రాజుపాళెం మండ‌ల జ‌డ్పీటీసీ మాజీ స‌భ్యుడు భాస్క‌ర్ కూడా ఎమ్మెల్యేను వ్య‌తిరేకించి ఎమ్మెల్సీకి దగ్గరయ్యారు. ఎమ్మెల్యే వ‌ర్గీయులు త‌న‌ను బెదించార‌ని భాస్క‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేశారు. స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసి బ‌య‌ట‌కు వ‌చ్చిన భాస్క‌ర్.. ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుప‌డుతూ విమ‌ర్శ‌లు చేశారు. ఇలా ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు వ‌ర్గీయులంతా ర‌మేష్ వ‌ర్గం వైపు అడుగులు వేస్తుండ‌టంతో ప్రొద్దుటూరు వైసీపీలో రాజ‌కీయం గ‌రం..గ‌రంగా మారింది. 


మరి సీఎం జగన్ వద్ద ఎవరిది పైచేయి..
అయితే ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు కూడా త‌న వ‌ర్గాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ కొంద‌రు కౌన్సిల‌ర్లు మిన‌హా మిగిలిన వారంతా ఆయ‌న వైపే ఉన్నారు. అయితే సీఎం వైఎస్ జగన్ దగ్గర తనకు ఉన్న ప్రాధాన్యత తగ్గలేదని నిరూపించుకోడానికి తన వర్గమైన వ్యక్తికే రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించుకున్నారు. కొంద‌రు వ్య‌తిరేకించినంత మాత్ర‌న జ‌రిగిన న‌ష్టం ఏమీ లేద‌ని ప్ర‌జాబ‌లం మాత్రం ఎమ్మెల్యే వైపే ఉంద‌నేది రాచ‌మ‌ల్లు వ‌ర్గీయ‌ల వాదన.


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిస్థితేంటో..


ఇలా ఇద్దరు నేతల మధ్య ఎప్పటికప్పుడు పోటాపోటీ ఘటనలు, వివాదాస్పద వ్యాఖ్యలు, కేసులతో రాన్రాను ప్రొద్దుటూరు రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ ఏ స్థాయిలో ఉంటుందోనని.. ఒకవేళ టికెట్ ఎవ్వరికి ఇచ్చినా.. ఒకరి నుండి మరొకరికి పరస్పర సహకారం ఉంటుందా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ అధినేత, సీఎం జగన్ (AP CM YS Jagan) చూస్తూ ఊరుకోరుకాబట్టి రాబోయే రోజుల్లో ప్రొద్దుటూరు రాజకీయం ఎలా మలుపు తిరుగుతుందోననే అభిప్రాయం నియోజకవర్గం ఓటర్లలో వినిపిస్తోంది. ప్రొద్దుటూరు ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉండనున్నాయో వేచిచూడాల్సిందే మరి.


Also Read : AP 10th Class: ఏపీలో చదువుల విప్లవం..10వ తరగతి పరీక్షా విధానంలో మరో కీలక మార్పు..!


Also Read : Anantha Babu Bail: ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్, కానీ తిరిగి జైలుకు వెళ్లాల్సిందే


Also Read : Jr Ntr Meet Amit Shah: జూనియర్ తో టీడీపీ ఖేల్ ఖతం! అమిత్ షా ప్లాన్ చెప్పిన కొడాలి నాని



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి