హైద‌రాబాద్‌: తెలంగాణలో పలు చోట్ల గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రకు సమీపంలో నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పిన వాతావరణ శాఖ అధికారులు... ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలావుంటే, మంగళవారం ఉదయం నుంచి బుధవారం రాత్రి వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా బుధవారం సాయంత్రానికే ఎగువ ప్రాంతం నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తింది. దీంతో 16 గేట్ల ద్వారా 1.20 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సరస్వతి బ్యారేజీ వద్ద 11 గేట్లను ఎత్తి 49,500 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. 


ఇక మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో కురిసిన వర్షాల ప్రభావంతో నాగార్జునసాగర్‌కు వస్తోన్న నీటి ఇన్‌ఫ్లో పెరిగింది. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో 68,430 క్యూసెక్కుల ప్రవాహం రాగా 4 గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి 32,440 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.