రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రకటన జారీ చేసింది. మార్చి 5న ఈ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయబోతున్నట్లు తెలిపింది. మార్చి 12 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, మార్చి13న నామినేషన్లు పరిశీలిస్తామని వెల్లడించింది. మార్చి 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. మార్చి 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు... అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ ప్రకటనలో పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 16 రాష్ట్రాలకు చెందిన 58 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ముగియనుండటంతో ఆయా స్థానాలకు ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. కేరళ నుంచి ప్రాతినిధ్యం వహించిన వీరేంద్ర కుమార్‌(జేడీయూ)రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి అదేరోజు ఉపఎన్నిక జరగనుంది. దీంతో ఎన్నికలు జరుగబోయే మొత్తం స్థానాల సంఖ్య 59 కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో కె.చిరంజీవి, రేణుక చౌదరి, టి.దేవేందర్‌ గౌడ్‌, తెలంగాణలో సి.ఎం రమేష్‌, రాపోలు ఆనంద్‌ భాస్కర్‌, పాల్వాయి గోవర్థన్‌ రెడ్డిల పదవీ కాలం ఏప్రిల్‌ 2తో ముగియనుంది. పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి ఇటీవలే మృతి చెందారు.


రిటైరయ్యే వారిలో ఎనిమిది మంది కేంద్రమంత్రులు ఉన్నారు. వీరిలో అరుణ్‌ జైట్లీ, రవిశంకర్‌ ప్రసాద్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, జెపి నడ్డా, ప్రకాశ్‌ జవదేకర్‌, తావర్‌ చంద్‌ గెహ్లాట్‌, పురుషోత్తం రూపాలా, మన్‌సుఖ్‌ ఎల్‌.మాండవీయలు ఉన్నారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, నటి రేఖ, జయాబచ్చన్ లతో పాటు ఇతర రాజకీయ పార్టీల ముఖ్యనేతలు పదవీకాలము ఏప్రిల్ 2 తో ముగియనుంది.