జగన్ సీఎం అయ్యేందుకు మేము సహకరిస్తాం: కేంద్ర మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పార్టీని ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత సహాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) అధ్యక్షుడు రాందాస్ అథవాలే అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత సహాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) అధ్యక్షుడు రాందాస్ అథవాలే అన్నారు. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్షేమ నిధుల వినియోగం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రాందాస్ అథవాలే.. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగడం చంద్రబాబు తొందరపాటు నిర్ణయమని అన్నారు. ఎన్డీఏలో టీడీపీ కొనసాగి ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ప్రధాని సానుకూల నిర్ణయం తీసుకుని ఉండేవారని హైదరాబాద్‌లో పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. వైకాపా ఎన్డీఏలో కలిస్తే ఆ పార్టీ అధినేత జగన్ సీఎం అయ్యేందుకు తాము సహకరిస్తామని కూడా అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలతో తాను ప్రత్యేకంగా మాట్లాడుతానన్నారు. అటు రాజ్యాంగాన్ని రక్షించడానికి తాను, మోదీ ఉన్నామన్న రాందాస్ అథవాలే.. కాంగ్రెస్‌ను రాహుల్ గాంధీ రక్షించుకుంటే మంచిదని సలహా అన్నారు. ప్రస్తుతం రాందాస్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన టీడీపీ నేతలు.. వైసీపీ నేత జగన్ మోదీను విమర్శించడం లేదని.. ఆ పార్టీతో లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్నారని అంటున్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు టీడీపీ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.