కర్నూలు: ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 2వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పార్టీ పరాజయం పాలవడంపై సమీక్ష జరపడానికే ఆయన మూడు రోజులు పాటు కర్నూలు జిల్లాలో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు కర్నూలు పర్యటనకు వస్తున్నారని తెలుసుకున్న రాయలసీమ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు చంద్రబాబు నాయుడి రాకను నిరసిస్తూ నిరసనకు దిగారు. చంద్రబాబు కర్నూలు జిల్లాకు రావొద్దని ఆయనకు వ్యతిరేక నినాదాలు చేస్తూ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ''చంద్రబాబు గో బ్యాక్'' అంటూ నినాదాలు చేసిన రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ.. రాయలసీమ ప్రాంత ప్రయోజనాల కోసం తెలుగు దేశం సర్కార్ ఎప్పుడూ పని చేయలేదని ఆరోపించింది. 


ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులు.. ''ఏపీ హైకోర్టును లేదా రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి రాయలసీమకు మార్చాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు ఓ అనుకూల ఓ ప్రకటన చేస్తేనే కర్నూలు జిల్లాలో ఆయనను అడుగు పెట్టనిస్తామని స్పష్టంచేశారు. రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ పట్టుపడుతున్న తీరు చూస్తోంటే.. చంద్రబాబుకు కర్నూలు జిల్లా పర్యటనలోనూ అవాంతరాలు తప్పవేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే కానీ జరిగితే.. చంద్రబాబు అమరావతి పర్యటన ఘటన మర్చిపోకముందే మరో షాక్ తగిలినట్టే అవుతుందనేది వారి అభిప్రాయం. ఇటీవల అమరావతి పర్యటనకు వెళ్లిన చంద్రబాబు కాన్వాయ్‌‌పై పలువురు ఆందోళనకారులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.