అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గురువారం చేపట్టిన అమరావతి పర్యటనలో హింస చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ డీజీపి గౌతం సవాంగ్ స్పందిస్తూ.. చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లతో దాడిచేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. చంద్రబాబు పర్యటనపై నిరసన వ్యక్తంచేస్తూ కాన్వాయ్‌పై చెప్పులు విసిరిన వ్యక్తి ఒక రైతు కాగా, రాళ్లు విసిరిన వ్యక్తిని రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించినట్టుగా ఏపీ డీజిపి వెల్లడించారు. చంద్రబాబు విధానాల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని.. అందుకే ఆయన కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డామని నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించినట్టు డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు.
చంద్రబాబు పర్యటనకు ఎలాంటి అవాంతరాలు ఉండవనే సమాచారం ఉన్నందునే తాము చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇచ్చామని డీజిపి సవాంగ్ స్పష్టంచేశారు.