ఆంధ్రప్రదేశ్ విభజన హామీల సాధనకు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తాము సిద్ధమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ప్రజలకు అన్యాయం జరిగితే సహించబోనని, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమ పార్టీ అవిశ్వాసానికి వెనుకాడినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చంద్రబాబు తెలిపారు. ‘విభజన హామీలు నెరవేరుస్తారనే  ఎన్డీయే కూటమిలో చేరాం. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు పూర్తికావస్తున్నా.. హామీలు అమలుకావడంలేదు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు కోసం ఇప్పటివరకు 29సార్లు ఢిల్లీకి వెళ్లా. ఆదుకోవాలని కేంద్రాన్ని కోరా. కేంద్రాన్ని పార్లమెంట్‌లో గట్టిగా నిలదీస్తాం. చివరి ప్రయత్నంగా అవిశ్వాసం పెడతాం’ అని అన్నారు.


అవిశ్వాసం కంటే ముందు చేయాల్సింది చాలా ఉందని చంద్రబాబు అన్నారు. పార్లమెంట్‌లో 54 మంది సభ్యుల మద్దతు ఉంటే తప్ప అవిశ్వాసం పెట్టలేమని, అవసరమైతే అన్ని పార్టీల మద్దతు తీసుకొని అవిశ్వాసం పెడతామని చెప్పారు. అవిశ్వాసం ఆఖరి అస్త్రం కావాలని పేర్కొన్నారు.