గ్రామ వాలంటీర్లలో వారిని తొలగించాలని సర్కార్ ఆదేశాలు
గ్రామ వాలంటీర్లలో విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులను తొలగించాల్సిందిగా ఏపీ సర్కార్ ఆదేశాలు
అమరావతి: గ్రామ వాలంటీర్లుగా ఎంపికైన అభ్యర్థులలో విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారు ఉన్నట్టయితే, వారిని వెంటనే విధుల నుంచి తొలగించాల్సిందిగా ఏపీ సర్కార్ అన్ని జిల్లాల సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు.. గ్రామ వాలంటీర్లు కళాశాలల్లో చదువుకుంటున్నా, లేక వారు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నట్లుగా నిరూపిస్తూ దృవపత్రాలతో సహా ఎవరైనా ఫిర్యాదు చేసినా.. వెంటనే వారిని ఉద్యోగాల నుంచి తొలగించి వారి స్థానంలో అర్హులైన వారిని నియమిస్తామని ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుంచి గ్రామ వాలంటీర్లు విధుల్లో చేరాల్సి ఉండగా సర్కార్ నుంచి వెలువడిన ఈ ఆదేశాలు పలువురు అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఈనెల 15న గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాను ఎగుర వేసిన అనంతరం గ్రామ వాలంటీర్లకు గుర్తింపు కార్డులు అందజేయనున్నారు.