పవన్ కళ్యాణ్ అభిమానుల పేరుతో.. అలాగే జనసేన కార్యకర్తల పేరుతో ఓ దొంగల ముఠా ఏలూరు ప్రాంతంలో హల్చల్ చేసింది. ఏలూరుకి చెందిన కొందరు యువకులు జనసేన కార్యకర్తలమని చెప్పుకుంటూ ఫేస్‌బుక్‌లో ఓ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో అనేకమందితో పరిచయం పెంచుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఓ ప్రముఖ గోల్డ్ షాపు యజమాని కుమార్తెను కూడా పరిచయం చేసుకొని.. ఆమెను కూడా జనసేనలో చేరాల్సిందిగా కోరారు. తమ పార్టీ కార్యకలాపాల కోసం కొంత డబ్బు అవసరమని అడిగారు. ఆమె తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో.. తాకట్టు కోసం నగలు ఇవ్వమని కోరారు. ఆమె వారిని నమ్మి నగలు అందించగా.. వారు అవి అమ్మి ఆ డబ్బుతో పరారయ్యారు.


తాను మోసపోయానని.. జనసేన పార్టీ పేరుతో కొందరు ఆకతాయిలు తనను మోసం చేశారని ఆ సదరు యువతి గ్రహించడంతో ఆమె ఏలూరు పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఆ యువతి నుండి అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు, సదరు యువకుల ఫేస్‌బుక్ పేజీలపై నిఘా పెట్టి.. తర్వాత వారి వ్యక్తిగత సమాచారం కూడా సేకరించి.. పలు ఆధారాలు కూడా కనుక్కొని వారిని అరెస్టు చేశారు.


వారి నుండి 3 కేజీలకు పైగానే బంగారంతో పాటు రెండు మోటార్ సైకిళ్లు, సెల్ ఫోన్లు, కార్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వారి నుండి స్వాధీనం చేసుకున్న సామాగ్రితో పాటు బంగారం ఇత్యాది వస్తువుల విలువ దాదాపు కోటి రూపాయలకు పైగానే ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.