రొట్టెల పండుగలో పాల్గొననున్న పవన్ కల్యాణ్
రొట్టెల పండుగలో పాల్గొననున్న పవన్ కల్యాణ్
పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం నెల్లూరులో పర్యటించనున్నారు. నెల్లూరు పర్యటనలో ఆయన స్వర్ణాల చెరువు వద్ద ఉన్న బారాషహీద్ దర్గాను సందర్శించనున్నారు. తన సినీ మిత్రుడు అలీతో కలిసి ఆయన దర్గాను సందర్శిస్తారు. అలీతో కలిసి రొట్టెల పండుగకు హాజరవడంతో పాటు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుండి రేణిగుంట వరకు విమానంలో ప్రయాణించి.. అక్కడి నుండి రోడ్డు మార్గంలో నెల్లూరు బారాషహీద్ దర్గాకు చేరుకుంటారు పవన్ కళ్యాణ్.
అలీ త్వరలో జనసేనలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పవన్‌తో కలిసి ఈ పర్యటన చేయడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లయింది. గతంలో స్నేహితులైన వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు..అందుకే అజ్ఞాతవాసిలో నటించలేదని.. అలీ టీడీపీ నుంచి బరిలో దిగుతున్నట్లు ప్రచారమూ జరిగింది.
బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు ప్రసిద్ధి. రొట్టెల పండుగ మతసామరస్యానికి ప్రతీక. ప్రతి ఏడాది మొహర్రం నెలలోనే ఇది జరుగుతుంది. కులమతాలకతీతంగా హిందూ, ముస్లింలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నట్లు రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటారు నెల్లూరు జిల్లాలోని బారాషహీద్ దర్గా దగ్గర జరిగే ఈ వేడుకకు వివిధ రాష్ట్రాల నుంచే కాక విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తారు. కోరికలు తీరిన వారు రొట్టెలను పంచితే, కోరికలు కోరుకున్న వారు వాటిని అందుకుంటారు.