మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ.. కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీయే అని, 13 జిల్లాలకు పరిమితమైన పార్టీలవల్ల ఉపయోగం లేదని, ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. ఆగస్ట్ నెలలో కర్నూలులో భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా రెడ్డి, మాజీ రైల్వే సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీడీపీలో చేరాలని బైరెడ్డి చాలాకాలంగా చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పార్టీలోని ఓ వర్గం వ్యతిరేకిస్తోంది. కర్నూలు జిల్లా తెలుగుదేశం నాయకులు కూడా ఆయన చేరికను బాహాటంగానే వ్యతిరేకించారు. దీంతో ఇక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని డిసైడ్ అయ్యారు.


స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బైరెడ్డి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఎన్నికల బరిలో ఉన్న తన అనుచరుడి నామినేషన్‌ను ఉపసంహరింపజేశారు. దీంతో బాబుకు దగ్గరవ్వాలని ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసి గొట్టాయి. చివరివరకూ ఆయన టీడీపీలో చేరాలని ప్రయత్నించారు. కానీ అది సాధ్యపడలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి గాలం వేశారు. టీడీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు నెరవేరకపోవడంతో బైరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.


1994లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన బైరెడ్డి పదేళ్ళ పటు ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నందికొట్కూరు శాసనసభ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బైరెడ్డి.. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చారు. రాష్ట్ర విభజన ప్రకటనతో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చిన తరుణంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రత్యేక రాయలసీమ కోసం 'రాయలసీమ పరిరక్షణ సమితి' పార్టీని స్థాపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేసినా డిపాజిట్ కూడా దక్కలేదు. ఆతరువాత బైరెడ్డి కొన్ని రోజులు అజ్ఞాతంలో వెళ్లిపోవడం.. కేడర్ కూడా అంతంత్రమాత్రంగానే ఉండటంతో పెద్దగా కలిసిరాలేదు. 


బైరెడ్డి కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీతో భేటీ అయ్యారు.మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా బైరెడ్డిని సంప్రదించారని సమాచారం. దీంతో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.