హైదరాబాద్ : ప్రముఖ చరిత్రకారుడు లోలపు తిరుపతి మాట్లాడుతూ.. అక్షరం అంటే ఘనీభవించిన జ్ఞానం అనీ నమ్మీ, ఆ అక్షర సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండి, సమాజంలో పేట్రేగిపోతోన్న అమానవీయ సామాజిక రుగ్మతలకీ, చాందస భావాలకి, దేశ ప్రజల్లో శీఘ్రగతిన పెరుగుతున్న సామాజిక అర్ధిక అంతరాలని, దుర్బర బహుజన జీవితాలని చూసీ కన్నీటితో విలపించి తల్లడిల్లిన దాతృత్వ హృదయం ఆ పునీత పుణ్య దంపతులు "భారత జాతి పితా మహాత్మ ఫూలే", "భారత మాత సావిత్రమ్మలదీ"! అని కొనియాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ భూమ్మీద ఉన్న సర్వ మతాలు మానవ మనుగడకి, అభివృద్ధికి మూల కారణం, కేంద్ర బిందువు అయిన స్త్రీని, వారి బహుముఖ వికాసాన్ని కాలరాసే క్రతువునీ పాపం అన్నీ కూడా అంకితభావంతో పని చేశాయి. చేస్తూనే ఉన్నాయి! ఒక్క బౌద్ధం మినహా!! అవిద్య వలన సంభవించే సామాజిక విపత్తులను, విపరీత పరిణామాలనీ బోధిసత్వుడి జ్ఞాన వెలుగులో ఆకళింపు చేసుకున్న మహా తాత్వికుడు మహాత్మ జ్యోతిభా ఫూలే అని అన్నారు. 


జన జాగృత జైత్ర యాత్రకు జంగు సైరన్ ఊదే ప్రక్రియ తన ఇంటి నుండే మొదలు పెట్టీ, అందులో భాగంగా తన సతీమణి సావిత్రీ భాయ్ ఫూలే కి ఓనమాలు నేర్పి, తన ఉద్యమంలో భాగస్వామిని చేస్తూ, యావత్ భారత మహిళా సమాజోద్ధరణకి శ్రీకారం చుట్టిన సాంఘిక విప్లవ కారుడు, అక్షర సూరీడు ఈ మహాత్మ ఫూలే దంపతులు అని అభిప్రాయపడ్డారు. 


సర్వ సమస్యల పరిష్కారానికి ,అవిద్య మూలంగా జనించే అనేక సామాజిక రుగ్మతలను తెగ నరికేందుకు బౌద్ధ జ్ఞాన కిరణాల వెలుగులో తయారుచేసిన పదునైన ఆయుధమే జ్ఞాన ఖడ్గం!! నూట యాభై ఏళ్ల కిందట రూపుదాల్చిన ఈ జ్ఞాన ఖడ్గం ధరించే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు, దాన్ని చేతబట్టి తిప్పడం నేర్చిన జాతులే నేడు బతికి బట్ట కడుతున్నాయి, కడుతాయి కూడా!! శాస్త్ర సాంకేతిక ప్రగతి అంతగా లేని ఆ కాలంలోనే ఇంతటి భవిష్యత్ దర్శనం చేయగల ఆ మేధస్సునీ గురించి చదువుతుంటే ఆ పదాల పెదాలు కూడా అదురుతున్నట్లు అనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 


మార్క్స్ , బుద్ధుడు, శివాజీ, పెరియార్, సాహు, అంబేద్కర్ తదితర భారత సాంఘిక విప్లవకారుల జయంతుల్లో, వర్దంతిల సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ బిందేడన్ని పాలో, నీల్లో, ఓ బండేడన్ని పూల మాలలో వేసి చప్పట్లు గొట్టి, చాయి బిస్కెట్లు తిని తర్వాత రోజు నుండి మనువు గీసిన గీత దాటకుండా బతుకుని నడిపే మనుషులు ఉన్నన్ని రోజులు ఈ బతుకులు మారవు గాక మారవు. ఆ మహనీయుల జ్ఞాన వెలుగులో నడవడం అంటే అజ్ఞానంతో విజ్ఞానం చేసే యుద్ధం వంటిధీ! ఆ యుద్ధంలో గెలిపించేధీ, మనుషుల మనసులకు వేసిన అదృశ్య బానిస సంకెళ్లని బద్దలు కొట్టి విముక్తిని ప్రసాదించేది ఒక్క జ్ఞాన ఖడ్గం ద్వారా మాత్రమే సాధ్యం అనీ, ఆచరించి చూపిన ప్రయత్నంలో తమ జీవితాలని త్యాగం చేసిన పుణ్య పురుషులు ఫూలే దంపతులని ఆయన పేర్కొన్నారు. 


ఫూలే దంపతుల గురించి స్మరించుకోవడం అంటే సర్వమానవ సమానత్వం సౌభ్రాతృత్వం గురించీ, అందరికీ నిర్బంధ విద్యా గురించీ, మానవ హక్కుల గురించీ, మానవీయ విలువల గురించీ, సామాజిక న్యాయం గురించీ, నిఖార్సయిన దేశ భక్తుల గురించీ, సుసంపన్నమైన భారత జాతి చారిత్రక సంపదగా పరిఢవిల్లుతున్న సామాజిక చైతన్యం-ఉద్యమకారుల గురించీ మాట్లాడుకోవడం లాంటిది అని గుర్తు పెట్టుకోండి మిత్రులారా అని అన్నారు. 


వారి ఆలోచనా కొనసాగింపులో నాగరికులం, మేధావులం అని జబ్బలు చరుచుకుంటూ పోజులు గొట్టే మనం... వారీ త్యాగాల భాటలో పయనిస్తూ పది శాతం సఫలమైన అదే మన జీవితాల్లో ఆ మహనీయులకి మనం ఇవ్వగల ఘన నివాళి, నిజమైన ప్రణామం అని ఆయన తన అభిప్రాయాలను ప్రస్తావించారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..