హైదరాబాద్‌కి పశ్చిమ శివార్లు అయిన గచ్చిబౌలి, పటాన్‌చెరు, లింగంపల్లి తదితర ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లే యాత్రీకులు, తిరుపతి నుంచి హైదరాబాద్ లోని ఆయా ప్రాంతాలకు వచ్చే ప్రయాణికులకు ఇదొక గుడ్ న్యూస్. ఇకపై ఆయా ప్రాంతాలకు చెందిన యాత్రికులు తిరుపతి వెళ్లేందుకు రైలు ఎక్కడానికి సికింద్రాబాద్‌ స్టేషన్‌ వరకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు తిరుపతి-సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఇకపై లింగంపల్లి వరకు సేవలు అందించనుంది. ఈమేరకు దక్షిణమధ్య రైల్వే అధికార యంత్రాంగం ఓ నిర్ణయాన్ని తీసుకోవడమే కాకుండా తమ నిర్ణయాన్ని బుధవారం నుంచే అమలులోకి తీసుకువచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఇకపై నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రైలు టైమ్ షెడ్యూల్ ఇలా ఉండనుంది:
తిరుపతి-సికింద్రాబాద్‌ నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ (రైల్‌ నెంబర్‌: 12733) ఇకపై తిరుపతి-లింగంపల్లి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌గా తిరుపతిలో సాయంత్రం 6.25గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6.25గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ చేరుకోనున్న రైలు.. 6.30గంటలకు లింగంపల్లి వైపు బయల్దేరనుంది. అనంతరం 7.15గంటలకు లింగంపల్లి స్టేషన్‌కు చేరుకుంటుంది.


ఇక సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ (రైల్‌ నెంబర్‌: 12734) ఇకపై లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌గా లింగంపల్లి నుంచి సాయంత్రం 5.15గంటలకు బయల్దేరి 6గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు  చేరుకుంటుంది. అక్కడి నుంచి 6.05గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6.05గంటలకు తిరుపతి చేరుకోనుంది.


నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు లింగంపల్లి నుంచి తిరుపతి వైపు వెళ్లేటప్పుడు, అలాగే తిరుపతి నుంచి లింగంపల్లి వైపు వచ్చేటప్పుడు రెండు సందర్భా్ల్లోనూ సికింద్రాబాద్-లింగంపల్లి స్టేషన్ల మధ్య ఉన్న బేగంపేట రైల్వే స్టేషన్‌లో 1 నిమిషంపాటు ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు సేవల విస్కృతి పెంచడం కారణంగా హైదరాబాద్‌లోని పశ్చిమ శివార్ల ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు, ప్రయాణికులు, అలాగే, తిరుపతి నుంచి ఇక్కడకు వచ్చే ప్రయాణికులకు ప్రయాణంలో కొంత శ్రమ తగ్గనుంది.