Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లో ఇక వానలే వానలు..మరింత విస్తరిస్తున్న నైరుతి రాగం..!
Southwest Monsoon: దేశంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో విస్తారంగా వానలు పడుతున్నాయి. మరో రెండు మూడురోజులపాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ..ఆగమనాన్ని ఘనంగా చాటుతున్నాయి. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. కర్నూలు, కడప, అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో విస్తారంగా వానలు పడ్డాయి. ఇటు తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నల్గొండ, ఆసిఫాబాద్ జిల్లాల్లో కుండ పోత వర్షాలు కురిశాయి.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లా సంగంలో 16 సెంటీమీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లా ఉదిత్యాలలో 15.63, నాగర్ కర్నూలు జిల్లా తోటపల్లిలో 13.63 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా కందుకూరులో 13.13, ఆమనగల్‌లో 12.68, వనపర్తిలో 12.53, రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్ పేటలో 11.58, నాగర్ కర్నూల్ జిల్లా యనగంపల్లిలో 11.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో 10.30 సెంటీమీటర్ల వర్షం పడింది. గత రెండురోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడురోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు రైతులు సైతం పొలం పనుల్లో నిమగ్నమయ్యాయరు. క్రమంగా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి.
తాజాగా మరాఠ్వాడ, తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. డయ్యూ, నందుర్బార్, జల్గావ్, పర్బని, రెంటచింతల, మచిలీపట్నం మీదుగా పవనాలు వెళ్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. బీహార్ నుంచి తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా ఏపీ తీరం వరకు కేంద్రీకృతమైంది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook