శ్రీశైలం: తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం జలాశయంలోకి భారీ వరద నీరు వచ్చిచేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ఇన్‌ఫ్లో 1.69 లక్షలు కాగా, ఔట్‌ఫ్లో 2.25 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో శ్రీశైలం డ్యామ్ నుంచి ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు శ్రీశైలం నీరు దిగువకు వదులుతుండటంతో నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌లోకీ భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో సాగర్‌లో ఆరు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఇన్‌ఫ్లో: 1.50 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో: 65వేల క్యూసెక్కులుగా ఉంది. 


ఇక నారాయణ్‌పూర్‌ ప్రాజెక్టు విషయానికొస్తే, ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో: 90 వేలు కాగా, ఔట్‌ఫ్లో: లక్షా 15వేల 960 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం: 492.252 అడుగులు కాగా, ప్రస్తుతం 492.10 అడుగులు మేర నీరు చేరుకుంది. దీంతో నారాయణపూర్ రిజర్వాయర్ నిండు కుండను తలపిస్తోంది. ఈ ప్రాజెక్టు నుంచి 13 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.