న్యూఢిల్లీ: టీడీపికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యులలో నలుగురు రాజ్యసభ సభ్యులైన సుజనాచౌదరి, సీఎం రమేష్‌, గరికపాటి రామ్మోహన్‌రావు, టీజీ వెంకటేష్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపి నడ్డా సమక్షంలో బీజేపిలో చేరిన అనంతరం ఎంపి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ తాము బీజేపిలో చేరడానికి దారితీసిన పరిస్థితులపై, తమ నిర్ణయం వెనుకున్న కారణాలను విశ్లేషిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేరాలంటే బీజేపీతో కలిసి పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తూనే.. బీజేపీతో సంఘర్షిస్తే ఉపయోగం లేదని తేల్చిచెప్పారు. అంతేకాకుండా యావత్ భారతం ఎవరితో ఉందనే విషయం ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలతో తేలిపోయిందని స్పష్టంచేశారు. అందుకే తాము కూడా బీజేపీలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు సుజనా చౌదరి తెలిపారు. 


సుజనా చౌదరి వ్యాఖ్యలు చేసిన తీరు చూస్తోంటే, హక్కుల కోసం కేంద్రంపై పోరాటమంటూ ఎన్నికలకు ముందు కేంద్రంతో టీడీపీ అనుసరించిన ధోరణిని ఆయన పరోక్షంగా తన వ్యాఖ్యలతో వేలెత్తి చూపించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రంతో విభేదించి ఎన్డీఏ నుంచి టీడీపి బయటికొచ్చిన నేపథ్యంలోనే అప్పుడు కేంద్రంలో సహాయ మంత్రిగా వున్న సుజనా చౌదరి తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.