Heavy Rains: ఏపీలో ఇవాళ్టి నుంచి మూడ్రోజులు వర్షాలు, హైదరాబాద్‌లో భారీ వర్షం
Heavy Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా రానున్న ముడ్రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. జూలై నెల వచ్చినా వర్షం జాడే లేకుండా పోయిన పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వర్షాలు కురిపిస్తుందని ఆశిస్తున్నారు.
Heavy Rains: ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు అటు దేశంలో ఇటు రాష్ట్రంలో చాలా ఆలస్యంగా ప్రవేశించాయి. అయినా అప్పటికీ సరైన వర్షపాతం నమోదు కాలేదు. సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఏపీలో ఇప్పటి వరకూ 35 శాతం వర్షపాతం లోటు ఉందని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక జూలై నెలలో అయినా వర్షపాతం ఆశించిన మేర ఉంటుందా అంటే అనుమానంగానే ఉంది.
నైరుతి రుతు పవనాల ప్రభావం దక్షిణాదిపై లేకపోయినా ఉత్తరాదిన మాత్రం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, డిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్ని వరద నీరు ముంచెత్తుతోంది. దక్షిణాదిన మాత్రం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ, తెలంగాణలో 35-36 శాతం లోటు ఉంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉండటం వల్ల రానున్న మూడ్రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సూచించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. రానున్న మూడ్రోజులు ఏయే జిల్లాల్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
ఇవాళ శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, శ్రీ సత్యసాయి, కోనసీమ, తూర్పు గోదావరి, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
ఇక బుధవారం అంటే జూలై 12వ తేదీన చిత్తూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, కోనసీమ, గుంటూరు, పల్నాడు, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. జూలై 13వ తేదీ గురువారం కూడా తూర్పు గోదావరి, చిత్తూరు, అన్నమయ్య, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. నిన్న పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 9.3 , విజయనగరం జిల్లా బొబ్బిలిలో 8.2, అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో 8.2, శ్రీకాకుళం జిల్లా పలాసలో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మరోవైపు మంగళవారం రాత్రి హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. నగరంలోని గచ్చిబౌలి, మియాపూర్, సోమాజీగూడ, చందానగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట్, కూకట్ పల్లి, ఖైరతాబాద్, కొండాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది.
Also read: Ambati Rayudu: పవన్ కళ్యాణ్‌కు అంబటి రాయుడు కౌంటర్.. వాలంటీర్లకు మాజీ క్రికెటర్ సపోర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook