బీజేపీ పది సర్పంచ్ స్థానాలను కూడా గెలేవలేదు: లోకేశ్
ఏపీలో బీజేపీ బలంగా లేదని, గట్టిగా కొడితే పది సర్పంచ్ స్థానాలను కూడా గెలవలేదని ఐటీ, పంచాయితీరాజ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
ఏపీ/తిరుపతి: ఏపీలో బీజేపీ పార్టీ బలంగా లేదని, గట్టిగా కొడితే పది సర్పంచ్ స్థానాలను కూడా గెలవలేదని ఐటీ, పంచాయితీరాజ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. తిరుపతిలో సోమవారం సాయంత్రం జరిగిన ధర్మ పోరాట సభలో ఆయన మాట్లాడారు. విభజన హామీలు నెరవేరతాయని నమ్మకంతో బీజేపీతో 2014లో పొత్తు పెట్టుకొని ఎన్నికలలో పోటీ చేశామని లోకేశ్ అన్నారు. అయితే బీజేపీ నమ్మక ద్రోహం, మిత్ర ద్రోహం చేసిందన్నారు. రాష్ట్ర ప్రగతికి అహర్నిశలూ శ్రమిస్తున్న చంద్రబాబును ప్రోత్సహించి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే బీజేపీ గౌరవం నిలబడి ఉండేదన్నారు. బీజేపీ నేతలు జగన్‌తో పొత్తు కోసం వెంపర్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.
తన వయస్సు 34 సంవత్సరాలు అని చెప్పిన లోకేశ్.. ఇంకో 40 ఏళ్లు రాష్ట్ర రాజకీయాలలో ఉండాలన్నది తన కోరిక అని వెల్లడించారు. తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబు అంత మంచి పేరు సంపాదించకపోయినా వారికి చెడ్డపేరు మాత్రం తీసుకురానని అన్నారు. వచ్చే ఎన్నికలలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుందని, 25 ఎంపీ స్థానాల్లో విజయం సాధించి హస్తినలో చక్రం తిప్పేది చంద్రబాబేనని చెప్పిన లోకేశ్.. తనపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపాలని హెచ్చరించారు.