అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన నేడు పామాయిల్ గెలలు, పత్తి మొక్కలు, వరి కంకులతో అసెంబ్లీకి వచ్చిన టీడీపీ నేతలు.. ఉదయాన్నే అసెంబ్లీ ఫైర్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ టీడీపీకి చెందిన శాసనసభ్యులు ఆందోళన చేపట్టారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన నేతలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలియజేశారు. అనంతరం ఫైర్ స్టేషన్ వద్ద నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీలోకి వెళ్లారు. అంతకంటే ముందుగా అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద పాత్రికేయులతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వైఎస్సార్సీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.


అంతకంటే ముందుగా పార్టీ నేతలతో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రజా సమస్యలపై చర్చించారని తెలుస్తోంది. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన తీరును అధినేత పార్టీ నేతలకు వివరించినట్టు సమాచారం.