కేంద్రం నుంచి ప్రత్యేక హోదా, అధిక మొత్తంలో నిధులు ఆశించిన ఏపీ టీడీపీ ఎంపీలకి అటు లోక్ సభలో ఇటు రాజ్యసభలో తీవ్ర నిరాశే ఎదురైనప్పటికీ.. రాజ్య సభలోంచి బయటికొచ్చిన అనంతరం మాత్రం వారికి ఓ స్పష్టమైన అనధికారిక హామీ లభించినట్టు తెలుస్తోంది. అనధికారిక హామీ ఏంటా అని కంగారు పడకండి! ఎందుకంటే సభ వెలుపల ఇచ్చే ఆ హమీలు ఉభయ సభల రికార్డులలో ఎక్కడా వుండవు కనుక. అవును, సభ వాయిదా పడిన అనంతరం సభా ప్రాంగణంలోనే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన తమకు ఆయన నుంచి స్పష్టమైన హామీ లభించింది అంటున్నారు టీడీపీ ఎంపీ సీఎం రమేష్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సభ ముగిసిన వెంటనే తాను, కేంద్ర సహాయ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి జైట్లీ వద్దకు వెళ్లామని, జైట్లీ వద్ద ఏపీ రెవిన్యూ లోటు గురించి ప్రస్తావించగా, త్వరలో గణాంకాలు తెప్పించుకుని ఆ రెవిన్యూ లోటు విడుదల చేస్తామని ఆయన తమతో చెప్పినట్టు సీఎం రమేశ్ తెలిపారు. అంతేకాకుండా ఆయా గణాంకాలకు సంబంధించి ఫైళ్లు తీసుకుని రావాల్సిందిగా సూచించడమేకాకుండా... పోలవరంపై కూడా క్లారిటీ ఇచ్చారని సీఎం రమేష్ పేర్కొన్నట్టు సమాచారం. 


పోలవరం ప్రాజెక్టుతోపాటు నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులని సాధ్యమైనంత త్వరలో విడుదల చేస్తామని మంత్రి జైట్లీ చెప్పారని టీడీపీ ఎంపీ వివరించినట్టు మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. రైల్వే జోన్ అంశాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా స్పష్టత ఇచ్చారని, తమ పార్టీ అధినేత చంద్రబాబు మార్గదర్శకాలు, సూచనల మేరకు తాము జరిపిన పోరాటం ఫలించిందని సీఎం రమేష్ ఆనందం వ్యక్తంచేశారనేది ఆ కథనాల సారాంశం. ఒకవేళ టీడీపీ ఎంపీలకి కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినట్టుగానే తర్వాతి ప్రక్రియ కూడా పూర్తయితే, ఏపీ ప్రజలకి అంతకన్నా ఇంకేం కావాలంటోంది కేంద్రం నుంచి భరోసా కోసం ఎదురుచూస్తున్న ప్రజానీకం.