తెలంగాణ సీఎం కేసీఆర్ వైజాగ్ వెళ్తున్నారా ?
సీఎం కేసీఆర్ వైజాగ్ వెళ్తున్నారా ?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం విశాఖలోని చినముషిడివాడలో వున్న శారదా పీఠాన్ని సందర్శించనున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 10 గంటలకు కేసీఆర్ ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంద్వారా నేరుగా శారదా పీఠానికి చేరుకుంటారని వార్తలొస్తున్నాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలో రాజశ్యామల దేవాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారనేది ఆ వార్తల సారాంశం. అయితే, కేసీఆర్ పర్యటనపై వివరాలు ఆరాతీయగా.. ఆయన పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కాలేదని సమాచారం అందినట్టుగానూ వార్తలు వెలువడుతున్నాయి. అధికారికవర్గాల ద్వారా ఓ అధికారిక ప్రకటన వెలువడితే కానీ కేసీఆర్ పర్యటన, కార్యక్రమం ఖరారవలేదని అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కేసీఆర్ వైజాగ్ పర్యటనపై వస్తున్న వార్తలు మాత్రం ఒకింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.