ఆంధ్రాలో తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ !!
తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఆంధ్రాలో ఫ్యాన్ ఫాలోయింగ్
తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఆంధ్రాలోనూ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో ఈరోజు మరోసారి నిరూపణ అయ్యింది. గతంలో సీఎం కేసీఆర్ ఆంధ్రాకు వెళ్లినప్పుడు అక్కడ భారీ సైజ్ ఫ్లెక్సీలు, పెద్ద పెద్దబ్యానర్లతో అక్కడి అభిమానుల నుంచి ఎంత ఘన స్వాగతం లభించిందో అందరికీ తెలిసిందే. అచ్చం అలాంటి దృశ్యాలే సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ ఇవాళ కనిపించాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ అభిమానులు ఇవాళ ఘనంగా ఆయన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.
కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షేక్ ఖదీర్ అనే అభిమాని తెనాలిలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ స్థానికుల దృష్టిని ఆకర్షిస్తోంది. అంతటితో తన అభిమానాన్ని సరిపెట్టుకోని ఆ అభిమాని.. కేసీఆర్ బర్త్ డే కేక్ కట్ చేసి ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా కేసీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పేద మహిళలకు చీరలు కూడా పంపిణీ చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తమ దృష్టిలో గొప్ప హీరో అని అందరికీ చాటిచెప్పిన ఆ అభిమాని... ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీలేని పోరాటం చేసిన కేసీఆర్‌ని స్ఫూర్తిని తీసుకుని ఆంధ్రా నేతలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడితే ఫలితం వుంటుందని తమ రాష్ట్ర నేతలకు విజ్ఞప్తి చేశారు.