హైదరాబాద్ : ఏపీ డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీ  అశోక్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. తమ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను తెలంగాణ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అశోక్ పిటిషన్ దాఖలు చేశారు. వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో పిటిషన్ ను అత్యవసరంగా  ఇంటివద్దే విచారించాలని కోరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ చౌహాన్ ..ఈ నలుగురు ఉద్యోగులను తమ  ఎదుట హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేశారు.  దీంతో తెలంగాణ పోలీసులు నలుగురు ఐటీ గ్రిడ్ ఉద్యోగులు ఫణి, భాస్కర్, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ లను కోర్టు ఎదుట హాజరుపర్చారు. అరెస్ట్ చేయడానికి గల కారణాలను వివరించడంతో అశోక్ వేసిన పిటిషన్ న్యాయస్థానం కొట్టి వేసింది. దీంతో తదుపరి విచారణకు లైన్ క్లియర్ అయింది.

ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితా, ఆధార్‌, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ‘ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ వద్ద అక్రమంగా ఉన్నాయంటూ ఓ డేటా అనలిస్ట్‌ తుమ్మ లోకేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ  ఫిర్యాదుపై స్వీకరించిన సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఈ సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.  ఇప్పటికే పోలీసులు అక్కడ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తునకు సహకరించే సమాచారం కోసం ఆరా తీశారు. ఈ క్రమంలో నలుగురు ఉద్యోగులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ నేపపథ్యంలో ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీ అశోక్ హైకోర్టును ఆశ్రయించడం జరింగింది


వాస్తవానికి ఈ కేసును ఎదుర్కొంటున్న ‘ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’సంస్థ టీడీపీకి సాంకేతిక సేవలందిస్తున్న తెలిసింది. ఈ క్రమంలో డేటా చోరీ ఆరోపణలు రావడంతో ఈ కేసుకు ఎనలేని ప్రాధాన్యత చోటు చేసుకుంది.