తెలంగాణ ఎన్నికల్లో టికెట్ రాలేదని.. అమరావతిలో నిరసన !
తెలంగాణ ఎన్నికల్లో టికెట్ రాలేదని.. అమరావతిలో నిరసన !
అమరావతి: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకోవాలని చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోన్న ఆశావహులు తమ పార్టీ అధిష్టానాలను నయాన్నో, భయాన్నో ఒప్పించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, ఈ క్రమంలో టికెట్స్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అధిష్టానాన్ని కలిసేందుకు ఢిల్లీ బాట పడుతుండగా, అదే పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న టీడీపీ నేతలు మాత్రం తమ అధిష్టానాన్ని కలిసేందుకు ఆంధ్రా రాజధాని అమరావతి బాట పడుతున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సీటు తమకే కేటాయించాలని కోరుతూ సామరంగారెడ్డి, ఆయన అనుచరులు గురువారం ఉదయం అమరావతిలో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు ప్రయత్నించారు. అనంతరం అక్కడే పార్టీ అధిష్టానంపై తమ అసంతృప్తిని వ్యక్తంచేస్తూ ఆందోళనకు దిగారు.
అయితే, సామ రంగారెడ్డి ఆందోళన విషయంలో తెలంగాణ టీడీపీ సీనియర్ నేత నామా నాగేశ్వర్ రావు పార్టీ అధినేత చంద్రబాబుకు, సామకు మధ్య మధ్యవర్తిగా సంప్రదింపులు జరిపారు. చంద్రబాబుతో చర్చించిన అనంతరం సామరంగారెడ్డికి నచ్చజెప్పేందుకు నామా నాగేశ్వరరావు ప్రయత్నించారు. అయితే ఎన్నికలకు మరో 15 రోజులే ఉండగా తమ నాయకుడికి ఎల్బీనగర్ స్థానం కాకుండా ఇబ్రహీంపట్నం టికెట్ కేటాయిస్తే, ఇప్పటికిప్పుడు పార్టీ కార్యకర్తలతో ఎలా సమన్వయం చేసుకోగలం అని ప్రశ్నిస్తూ సామ అనుచరులు ఆందోళన చేపట్టారు. అన్నింటికిమించి గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన సుధీర్ రెడ్డికి మహాకూటమి తరపున టికెట్ ఎలా ఇస్తారని ఈ సందర్భంగా సామ అనుచరులు పార్టీ అధిష్టానాన్ని నిలదీశారు. ఈ క్రమంలో సామ అనుచరులు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణకు వ్యతిరేక నినాదాలు చేసి తమ అసంతృప్తిని చాటే ప్రయత్నం చేశారు. అసలే మహాకూటమిలో సీట్ల పంపకాల విషయంలో ఎన్నో అంశాలు అభ్యర్థిత్వంపై ప్రభావం చూపిస్తున్న తరుణంలో సామ అనుచరుల నిరసన పార్టీ నిర్ణయాన్ని ఏమేరకు ప్రభావితం చేస్తుందో వేచిచూడాల్సిందే మరి.