ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణా జిల్లా నాగాయలంక ప్రాంతంలోని గుల్లలమోదలో 154 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రయోగ కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ భారీ ప్రాజెక్టు తొలి దశలో రూ.600 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు దసరా నుంచే ప్రారంభమౌతాయని సంబంధిత అధికారి వెల్లడించారు.
దేశంలో మరో క్షిపణి ప్రయోగ కేంద్రం అవసరమని గతంలో పలుమార్లు డీఆర్‌డీవో నిపుణులు కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో నాగాయలంక మండలంలోని గుల్లలమోద ప్రాంతం క్షిపణి ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. సముద్ర తీరానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో క్షిపణి పరీక్షలకు అనువుగా ఉంటుందని భావించిన నిపుణులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.
కాగా క్షిపణి ప్రయోగ కేంద్రం ప్రతిపాదన రాగానే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. కాగా ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా మరో రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని అధికార వర్గాల నుంచి సమాచారం.