చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఆయన రాజకీయాల్లో ఉండరు.. సినిమాలవైపే ఆయన దృష్టి కేంద్రీకరిస్తారని చెప్పారు. అందుకు కారణం లేకపోలేదు. ఆయన రాజ్యసభ సభ్యత్వం ఈ ఏడాది(2018)తో ముగియనుంది. 2012లో రాజ్యసభకు వెళ్లిన చిరంజీవికి ఈ ఏడాదితో సభ్యత్వం ముగియనుంది. రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం ఆరు సంవత్సరాలు.


అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం చిరంజీవిని మరోసారి రాజ్యసభకు పంపించాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. చిరంజీవి కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పెద్దల సభకు మరోసారి అవకాశం ఇవ్వాలని చిరంజీవి రాహుల్ ను కోరారట.  'ప్రజారాజ్యం' పార్టీ విలీన ఒప్పందంలో భాగంగా సోనియా గాంధీ ఇచ్చిన హామీ మేరకు ఆయనకు మరోసారి ఛాన్స్ దక్కనుందని సమాచారం. రాహుల్ కూడా చిరంజీవికి మరో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. అసలే.. కాంగ్రెస్ పార్టీ ఏపీలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇటువంటి సమయంలో చిరంజీవికి ఛాన్స్ ఇవ్వకుంటే ఏపీలో కాంగ్రెస్ మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని భావించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆయన సభ్యత్వాన్ని కొనసాగించాలని పార్టీ హైకమాండ్ ను కోరారు. కాగా చిరంజీవి సభ్యత్వం ఏప్రిల్ 2, 2018తో ముగియనుంది.