ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. కనుక రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ప్రభుత్వం కూడా సంబంధిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని.. కనుక ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకుండా సురక్షితంగా ఉండాలని.. ప్రమాదాలు జరిగితే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉష్ణోగ్రతలు అధికమైనప్పుడు.. జలం ఆవిరిగా మారి మేఘాలు దాదాపు 25,000 అడుగుల ఎత్తు వరకు ఏర్పడతాయని.. ఈ క్రమంలో అధిక బరువుండే ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై భూమి మీదకు వస్తాయని.. అవే పిడుగు ప్రమాదాలని అధికారులు తెలిపారు. తాజాగా పిడుగు ప్రమాదాల పట్ల జాగరూకతతో వ్యవహరించాలని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ విభాగానికి తెలిపింది. అలాగే కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాని నిలిపివేయమని కూడా విద్యుత్ శాఖ అధికారులను ప్రభుత్వం కోరింది. 


తాజాగా..  కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్, రూరల్ ప్రాంతాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం, అడ్డతీగల ప్రాంతాల్లో కూడా పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గుంటూరు అర్బన్, పెదకాకాని, మేడికొండూరుతో పాటు నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రాంత వాసులు.. చిత్తూరు జిల్లా తొట్టంబేడు, వెదురుకుప్పం వాసులు కూడా జాగరూకతతో వ్యవహరించాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ శాఖ హెల్ప్ లైన్లు 24 గంటలు పనిచేస్తాయని ఈ సందర్భంగా తెలిపారు.