తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని తెలిపిన ఆ ఆలయ మాజీ అర్చకులు రమణ దీక్షితులపై అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య సలహాదారు కోట శంకరశర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన అర్చకత్వంలో ఉండి రమణ దీక్షితులు ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడడం తగదన్నారు. ఇటీవలే టీటీడీలో ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా పనులు జరుగుతున్నాయని రమణ దీక్షితులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీవారికి సమర్పించిన కానుకలు మాయమవుతున్నాయని, ఆభరణాలు కూడా పరుల హస్తగతం అవుతున్నాయని ఆయన తెలిపారు. అయితే రమణ దీక్షితులు చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఇటీవలే టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆగమశాస్త్రం ప్రకారమే శ్రీవారికి సేవలు అందుతున్నాయని తెలిపారు. అలాగే శ్రీవారి ఆభరణాల విషయంలో కూడా తమ వద్ద అన్ని వివరాలు ఉన్నాయని.. రమణ దీక్షితులు చెబుతున్నవన్నీ అవాస్తవాలని ఆయన అన్నారు.


ఇటీవలి కాలంలో రమణ దీక్షితులు చేసిన పలు వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. స్వామి వారి గులాబీ వజ్రం 2001లో  మాయం కాగా.. 2018లో అలాంటి వజ్రమే జెనీవాలో వేలానికి వచ్చిందని ఆయన అన్నారు. తాను జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే ప్రధాన అర్చక పదవి నుండి తప్పించారని రమణ దీక్షితులు ఆరోపించారు. కాగా రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బ్రాహ్మణ సంఘం నేతలు స్పందించారు. శ్రీవారి వజ్రాలు పోయాయన్న విషయం ఇప్పుడే రమణ దీక్షితులు బయటపెట్టడానికి కారణమేంటని అడిగారు.