తిరుమల మారింది..!
పేరు కాదు.. తినే ఆహారం. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తిరుమల దుకాణాదారులు దెబ్బకు దిగివచ్చారు. తిరుమల వచ్చిన భక్తులు దేవుణ్ణి దర్శించుకొని కానుకలు ఇద్దాం అని వస్తే.. అక్కడి హోటళ్లు భగవంతుని వద్దకు వెళ్లకుండానే నిలువుదోపిడీ చేసేవారు. ఈ అంశంపై కొందరు భక్తులు హైకోర్టులో పిటీషన్ వేశారు. హైకోర్టు హోటల్ యజమానులకు మొట్టికాయ వేసింది. దాంతో రంగంలోకి టీటీడీ అధికారులు దిగి, హోటళ్ల ముందు ధరల పట్టిక ఉంచేలా చర్యలు చేపట్టారు.
నిన్నటివరకు రెండు ఇడ్లీలు 25 రూపాయలు కాగా.. ఇప్పుడు రూ.7.50పైసాలు. అలానే రూ. 15 అమ్మిన టీ ధర రూ.5, రూ.100 పలికిన భోజనం రూ.31కి చేరింది. వెజిటేబుల్ బిర్యాని రూ.50నుంచి రూ.19కు, ఉప్మా రూ.20 నుంచి రూ.9కి, ప్లేట్ మీల్స్ రూ.60 నుంచి రూ.22.50పైసలకు మారింది. ఇవేకాక అన్నిరకాల ఆహారాలమీద ధరలు సగానికి సగం తగ్గాయి. ఎవరైనా పట్టిక ధరల్లో సూచించిన విధంగా కాకుండా, ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఎవరైనా ఆలా చేస్తే తమను వెంటనే సంప్రదించాలని టీటీడీ అధికారులు భక్తులకు సూచించారు.